జగన్ సర్కార్ తీరుకు నిరసనగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని టీడీఎల్పీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్షం భేటీ అయి పలు విషయాలు చర్చించింది. మే 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు తొలి రోజు మాక్ అసెంబ్లీ జరగనుంది. మే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నట్టు టీడీఎల్పీ ప్రకటించింది.
కరోనా కట్టడిలో జగన్ విఫలమయ్యారని, ప్రజలను కాపాడడంలో చేతులెత్తేసిన జగన్… చనిపోతే అంత్యక్రియలకు డబ్బులిస్తామనడం ఏమిటని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని, ఆ సమావేశాలకు దీటుగా టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుందని వెల్లడించారు.
మరోవైపు, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. పలువురు టీడీపీ కార్యకర్తల అరెస్టుపై నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అరెస్టులు చేస్తున్నారని,కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేయడంపై మండిపడ్డారు. అరెస్టులతో ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.