మహారాష్ట్రలో, పశ్చిమ కనుమల్లో, నాసిక్ త్రయంబకం లో…… గోదావరి పుట్టే ప్రాంతాన్ని చూస్తే, ఒక చిన్న ఊట లా అనిపిస్తుంది.
కానీ అదే గోదావరి రాజమండ్రి దగ్గర చూస్తే…. దాదాపు ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.
అమరావతి మహా పాదయాత్ర పరిస్థితి కూడా అదే…. ప్రతిరోజు ఉదయం, బసచేసిన ప్రాంతం నుండి కొన్ని వందల మంది అమరావతి రైతులు పాదయాత్రను ప్రారంభిస్తారు.
ఆ తర్వాత ప్రారంభం అవుతుంది ఒక అద్భుతం…. కొన్ని నిమిషాల్లో వందల మంది, వేలల్లో కి మారతారు. 11 గంటల సమయానికల్లా, పదివేల మందికి తక్కువ కాకుండా… దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున అడుగులో అడుగేసి, నడుస్తున్న దృశ్యం… 11 రోజులుగా ప్రపంచం చూస్తోంది.
ఈరోజు 11వ రోజు. నాగులుప్పలపాడు లో బస నుండి బయలుదేరే సమయానికే… వర్షం మొదలైంది. వర్షంతో పాటు తీవ్రమైన పోలీసు నిర్బంధం. వందల మంది పోలీసులు రైతులు బసచేసిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పాదయాత్రకు బయటకు రావద్దని షరతులు విధించారు. అయినా… భయపడకుండా, వర్షంలోనే పాదయాత్ర ప్రారంభమైంది.
గత రాత్రి నుండే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తదితర నాయకులను హౌస్ అరెస్టు చేశారు.
నాగులుప్పలపాడు కు వచ్చే రహదారులు అన్నిటినీ దిగ్బంధనం చేసి, బయట గ్రామాల నుండి వచ్చే వేల మందిని పోలీస్ చెక్ పోస్ట్ లతో ఆపేశారు.
గత రాత్రి ఒంగోలులో బస చేసిన నేను కూడా, పోలీసు నిర్బంధాన్ని తప్పించుకుంటూ… చిన్న చిన్న గ్రామాల గుండా నాగులుప్పలపాడు చేరాను.
వర్షంలోనే పాదయాత్ర ప్రారంభమైంది. తీవ్ర పోలీసు నిర్బంధం లోను గంటల లోపు కొన్ని వేల మంది పాదయాత్రలో కలిశారు.
నాగులుప్పలపాడు నుండి బయలుదేరిన పాదయాత్ర… చదలవాడ, మద్దిరాలపాడు కు చేరుకొని భోజనానికి ఆగటం జరిగింది.
మధ్యాహ్న భోజనం అనంతరం… చేకూరపాడు, త్రోవగుంట దాటి ఒంగోలు శివారులో ఉన్న ముక్తినూతలపాడు లో ఏర్పాటుచేసిన రాత్రి బస కు చేరడం జరిగింది. దాదాపు 14 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు జరిగింది.
ప్రారంభం నుంచే తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసిన పోలీసులు, మీడియాను నియంత్రించే క్రమంలో, పాదయాత్రను కవర్ చేస్తున్న టీవీ5, ఏబీఎన్, మహా న్యూస్, ఈటీవీ ల సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది.
మీడియాపై నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీనియర్ జర్నలిస్టు మారెళ్ళ వంశీ రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలియజేయడం ఈ రోజు పాదయాత్ర లో హైలైట్. పోలీసు నిర్బంధాన్ని కూడా ఛేదించుకుని రహదారిపై పరిగెత్తుతూ వంశీ స్వయంగా రిపోర్టింగ్ చేయటం అమరావతి పట్ల ఆయన అంకితభావానికి సాక్ష్యం.
ఉప్పు నూతలపాడు దాటి… చదలవాడ ప్రవేశిస్తున్న దశలో పాదయాత్ర లో చేరిన మాజీ మంత్రి ఆలపాటి రాజా గారి తో పాటు ఎంతోమంది పాదయాత్రకు మద్దతుగా వస్తున్న దశలో చదలవాడ లో పోలీసులు విచక్షణా రహితంగా, దుర్మార్గంగా చేసిన లాఠీచార్జి వల్ల, సమీపంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆళ్ల నాగార్జునకు చేయు విరగటం, కాలుకు బలమైన గాయం కావటం జరిగింది.
ఈ పోలీసుల లాఠీఛార్జి అత్యంత దుర్మార్గం.
మహా పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించాలనే పోలీసు నిర్బంధం లో భాగంగా… కొన్ని వందల మంది పోలీసులు ఈరోజు ఉదయం సమీప గ్రామాలలో ఇంటింటికి వెళ్లి… ఏ ఇంటి నుంచి, ఎంతమంది, పాదయాత్రకు సంఘీభావంగా వెళ్లారు? అనే వివరాలు కుటుంబ సభ్యుల నుండి సేకరించడం జరిగింది.
ఇది ముమ్మాటికీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం.
మద్దిరాలపాడు దాటిన తర్వాత జాతీయ రహదారి మీదికి వచ్చిన సమయంలో, నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది.
ఒంగోలుకు చెందిన బోడపాటి అన్నపూర్ణమ్మ గారు, తన కొడుకు బైక్ పై పాదయాత్ర దారిపొడవునా… టీవీ డిబేట్స్ లో మాట్లాడే కొలికపూడి శ్రీనివాసులు ఎక్కడున్నాడు… అని వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్లకు జాతీయ రహదారిపై నేను కనిపించగానే… ఆమె కొడుకు ముందుగా నాకు పరిచయం చేస్తూ… మా అమ్మగారు, అన్నపూర్ణమ్మ గారు, మీ అభిమాని సార్ అని చెప్పాడు.
అంతలో అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ… మిమ్మల్ని చూడ కుండా నేను వెళ్ళిపోతాను ఏమో…. అని బాధపడుతున్నానండి… నా అదృష్టం మిమ్మల్ని కలిసాను… అని మాట్లాడుతూనే…. తన చేతికున్న బంగారు ఉంగరం తీసి… అమరావతి ఉద్యమానికి నా వంతుగా, మీ చేతుల మీదుగా ఇవ్వండి…. అని నా చేతులు పట్టుకున్నప్పుడు… నా జన్మ ధన్యమైంది అని… ఆ క్షణాలలో నాకనిపించింది.
అన్నపూర్ణమ్మ గారి భర్త హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి, పదవీ విరమణ చేసి, మరణించారు. ప్రస్తుతం ఆమె భర్త పెన్షన్ తో బతుకుతున్నారు. కానీ అమరావతి ఉద్యమానికి తన చేతికున్న ఉంగరం ఇచ్చేటప్పుడు… ఆమె మాటల్లో, ఆమె సంకల్పం లో, ఆమె ముఖంలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం.
ఇవన్నీ చూసిన నేను ఆమెకు పాదాభివందనం చేయడం తప్ప… ఏం చెప్పాలో అర్థం కాలేదు.
బహుశా ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది అదృశ్యంగా అమరావతిని రక్షిస్తున్నారు అనిపించింది.
695 రోజులుగా దీక్షా శిబిరాల్లో అమరావతి మహిళలు చేస్తున్న పోరాటం వృధా కాలేదు అనిపించింది.
ఈరోజు ఉదయం నుండి దాదాపు రెండు వందల వాహనాలలో పోలీసులు పాదయాత్ర అణచి వేయడానికి పని చేశారని నాకు సమాచారం అందింది.
తీవ్రమైన పోలీసు నిర్బంధాన్ని దాటుకొని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, సంతనూతలపాడు నాయకుడు విజయ్ కుమార్, అలాగే సాయంత్రానికి ఒంగోలు లో ప్రవేశిస్తున్న సమయానికి పాదయాత్రకు ఆహ్వానం పలికిన దామచర్ల జనార్ధన్ తమ కార్యకర్తలతో ఉద్యమానికి ఊపిరి పోశారు.
ఈ రోజు కూడా ఇతర జిల్లాల నుండి ఎంతోమంది పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
ఈ విధంగా పదకొండవ రోజు… ఉదయం కొద్దిసేపు వర్షం లో…. ఆ తర్వాత సాయంత్రం వరకూ పూలవర్షం పాదయాత్ర సాగింది.
కొలికపూడి శ్రీనివాసరావు