కొత్తగా ఇల్లు గానీ, అపార్ట్ మెంట్ గానీ నిర్మించుకోవాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవడం సర్వసాధారణం. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే ఇంటిని మనం మొదలుబెట్టాల్సి ఉంటుంది. ఇక, ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి నిర్మాణాన్ని బట్టి, ఇంటి స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి ప్రభుత్వం పన్ను విధిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఎవరికి నచ్చిన పెయింట్ వారు వేసుకుంటూ ఉంటారు.
అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి తీసుకోనక్కర్లేదు. అయితే, స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్ బర్గ్ అధికారులు మాత్రం ఇంటి ముందు గేటుకు నచ్చిన పెయింట్ వేయాలన్నా సరే తమ అనుమతి కావాలని అంటున్నారు. మిరిండా అనే మహిళ తన ఇంటికి మరమ్మతులు చేయించి ప్రధాన ద్వారానికి గులాబీ రంగు పెయింట్ వేయించారు. అయితే, అలా గులాబీ రంగు పెయింట్ వేయించడంపై కౌన్సిల్ ప్లానర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఆ తలుపునకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశించారు. అయితే తనకు గులాబీ రంగు నచ్చిందని, తనతో పాటు వీధిలో వెళ్లేవారు కూడా ఆ గులాబీ రంగు గేటు ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారని చెప్పారు. తలుపు రంగు ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను డిక్సన్ కు కౌన్సిల్ అధికారులు 20వేల పౌండ్లు అంటే భారతీయు కరెన్సీలో సుమారు 19 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇంటి తలుపునకు నచ్చిన రంగు వేసుకునే స్వతంత్రం కూడా స్కాట్లాండ్లో లేదా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.