పథకం ఏదైనా కానీ.. ముఖ్యమంత్రి ఫోటోను ప్రముఖంగా ఉండేలా తీసుకునే ఉత్సాహం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి రూ.1500 కోట్లు రాకుండా చేసిందా? అన్నది ప్రశ్నగా మారింది. కేంద్రం నిర్వహించే పథకం మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివరాల కంటే కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఫోటోను ప్రముఖంగా ప్రచురించిన వైనంపై కేంద్రం కన్నెర్ర చేసింది.ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు అందాల్సిన రూ.1500 కోట్లు ఆగిన పరిస్థితి.
వైద్య ఆరోగ్య.. గ్రహ నిర్మాణ శాఖతో పాటు ఇతర శాఖలకు ప్రత్యేక సాయం కింద రూ.4047 కోట్లు కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి అందాలి. ఇందులో వైద్య ఆరోగ్య శాఖకు రూ.1500 కోట్లు రావాలి. కేంద్రం నిధులతో అమలయ్యే పథకాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ప్రముఖంగా పబ్లిష్ చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం లోగోలు.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలకు ప్రాధాన్యత లభించటం లేదు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సందర్శించిన ఆసుపత్రుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు కానీ కేంద్ర ప్రభుత్వ లోగోలు కానీ లేకపోవటాన్ని గమనించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా రోగులకు ప్రత్యేకంగా అందించే చికిత్సకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ కింద ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ లోగో తో పాటు.. ప్రధాని ఫోటోను తప్పనిసరిగా ఉంచాలి.కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో కేంద్ర మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ లోగోలు.. ప్రధాని ఫోటోలు ఏర్పాటు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటోలను మాత్రమే హైలెట్ చేసిన నేపథ్యంలో కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఫోటోను ప్రముఖంగా ప్రచురించాలన్న అత్యుత్సాహం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1500 కోట్ల మొత్తాన్ని ఆపేసేలా చేసిందంటున్నారు. మరి.. ఈ విషయంలో కేంద్రాన్ని ఎలా కన్విన్స్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.