ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఐడి అధికారులు అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలోని ఏసీబీ కోర్టులో తాజాగా సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. 2021లో ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ లో గానీ, రిమాండ్ రిపోర్ట్ లు గానీ చంద్రబాబు పేరు లేదు. కానీ, తాజాగా సమర్పించిన ఎఫ్ ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చి, రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ37 గా సిఐడి అధికారులు పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ క్రమంలోనే చంద్రబాబును మరింత విచారణ జరిపేందుకు 15 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలంటూ న్యాయమూర్తిని సిఐడి అధికారులు కోరారు. 2021 డిసెంబర్ 9కి ముందే ఈ స్కామ్ జరిగిందని రిపోర్ట్ లో సిఐడి అధికారులు పొందుపరిచారు. అయితే, ఈ రిమాండ్ రిపోర్టుపై చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టు సరిగా లేదని వ్యాఖ్యానించారు. 2021 లోని రిమాండ్ రిపోర్ట్ , ఎఫ్ఐఆర్లో చంద్రబాబునాయుడు పేరు లేకపోవడం, ఇప్పుడు ఆయన పేరు చేర్చడం వంటి విషయాలపై లూత్రా వాదనలు వినిపిస్తున్నారు.
ఇక, ఈ కేసులో కీలకంగా మారిన 409 సెక్షన్ పై కూడా లూథ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే ఆ సెక్షన్ వర్తిస్తుందని వాదన వినిపించారు. అంతేకాదు, చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు కొందరు పోలీసులు వెళ్లారని, ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వారి లొకేషన్స్ప పరిశీలించాలని కోరారు. మరోవైపు, చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లోపే కోర్టులో హాజరు పరిచామని సిఐడి అధికారులు వెల్లడించారు.