ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ రోజుతో ఆమె కస్టడీ ముగిసిన నేపథ్యంలో కవితకు బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది.
కవితకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే కవితను తీహార్ జైలుకు తరలించారు. అయితే, ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని కవిత కోర్టు నుంచి బయటకు వస్తూ మీడియాతో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ కేసుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానంటూ కవిత ధీమా వ్యక్తం చేస్తూ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.
మరోవైపు, కవితకు తీహార్ జైల్లో కొన్ని ప్రత్యేక వెసులుబాటులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. కవిత విజ్ఞప్తి ప్రకారం ఈ వెసులుబాటులను న్యాయమూర్తి కల్పించారు. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు కవితకు కోర్టు అనుమతించింది. అదే విధంగా జైల్లో నిద్రపోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది.