సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు, రవాణా, వాడకం మూడూ పెరిగిపోయాయని, టీడీపీ సహా విపక్ష పార్టీలన్నీ చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ, అరకుతో పాటు మన్యంలోని ఏజెన్సీ ప్రాంతాలలో వందల ఎకరాల్లో గంజాయి సాగవుతున్నప్పటికీ… జగన్ సర్కారు నిమ్మకునీరెత్తిన్నట్టు వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శించారు. కొన్నిచోట్ల అయితే వైసీపీ నేతల కనుసన్నల్లోనే గంజాయి అక్రమ రవాణా, సాగు జరుగుతోందని వారు ఆరోపించారు.
అయినా సరే గంజాయి సాగును అరికట్టడంపై, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడంలో జగన్ సర్కార్ ఏ చర్యలు తీసుకోలేదు. దీంతోనే 2021 సంవత్సరానికి గాను దేశంలో అత్యధికంగా గంజాయి పట్టుబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పదో తరగతి పిల్లలు కూడా గంజాయి తాగుతున్న పరిస్థితులు ఉన్నాయని చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడలో 13 ఏళ్ల వయసున్న బడికి వెళ్లే బాలికలు గంజాయి తాగుతున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఆ వార్తలపై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. స్కూల్ పిల్లల వరకు గంజాయి చేరిందంటే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమూలంగా గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టిడిపి నేతలతో పాటు విపక్ష నేతలను వేధించేందుకు రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకునే ప్రక్రియలో ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు.
అటువంటి ప్రభుత్వం, యువత విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయడం క్షమార్హం కాని నేరం అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కొత్త సమస్యలు సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా పెట్టాలని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హితవు పలికారు.