ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, కొంతకాలంగా వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీవైపే జనం మొగ్గుచూపుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో పాటు కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు, పల్నాడు జిల్లా టీడీపీ నేతలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలందరూ సమన్వయంతో పని చేస్తూ పార్టీ విజయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలపై రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 125కు పైగా స్థానాలు దక్కుతాయని రాయపాటి జోస్యం చెప్పారు. వైసీపీపై నానాటికీ వ్యతిరేకత పెరుగుతుందని, టీడీపీ పాలన రావాలని జనం కోరుకుంటున్నారని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాయపాటి అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని రాయపాటి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటుంది అనే విషయం కూడా చంద్రబాబు నిర్ణయిస్తారని రాయపాటి తేల్చి చెప్పారు. ఏదేమైనా గుంటూరు ఉమ్మడి జిల్లాల సమావేశంలో రాయపాటి చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాయి.