ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఆసక్తి ఉంటుంది. డబ్బుకు లెక్కలేనోళ్లు.. తాము కోరుకున్నది సొంతం చేసుకోవటానికి ఎంతవరకైనా వెళతారు. అలాంటి కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. దుబాయ్ లో జరిగిన మోస్ట్ నోబుల్ నంబర్స్ వేలంలో ఒక కారు నెంబరుకు పలికిన ధర గురించి తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు కావటమే కాదు.. నిజమా? అనుకోకుండా ఉండలేరు. ‘పీ7’ నెంబరును దక్కించుకోవటం కోసం జరిగిన వేలంలో రూ.122 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యాపారవేత్త.
ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు? అతడేం చేస్తుంటాడు? అన్నది చూస్తే.. ఫ్రెంచ్ ఎమిరాటీ వ్యాపారవేత్త.. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడైన పావెల్ వాలెరివిచ్ దురోవ్ రూ.122 కోట్ల భారీ మొత్తాన్ని కారు నెంబరు కోసం వెచ్చించాడు. లక్కీ నెంబరుగా భావించే ఈ పీ7 నెంబరు కోసం మొదలైన వేలం రూ.33.5 కోట్ల వద్ద మొదలైంది. దిర్హామ్ లో చెబితే ఇది 15 మిలియన్ దిర్హామ్ లకు సమానం. 25 మిలియన్ దిర్హామ్ ల వద్ద కాసేపు ఊగిసిలాట జరిగింది. ఆ టైంలో వేలం అక్కడితో ముగుస్తుందని భావించారు. కానీ.. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు ముందుకు వెళ్లటంతో వేలం ముందుకెళ్లింది.
వేలం 25 మిలియన్ దిర్హామ్ లను దాటి 30 మిలియన్ దిర్హామ్ లకు చేరుకున్నంతనే మళ్లీ ఊపందుకొని 55 మిలియన్ దిర్హామ్ ల వద్దకు ముగిసింది. ఈ భారీ మొత్తం మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.122 కోట్లకు సమానం. భారీ మొత్తానికి సదరు లక్కీ నెంబరును సొంతం చేసుకున్నారు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు. రూ.122 కోట్లు పలికిన ‘పీ7’ నెంబరు తర్వాత మిగిలిన ఫ్యాన్సీ నంబర్లతో పాటు.. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లకు సైతం వేలం జరిగింది. అందులో రూ.101 కోట్ల భారీ మొత్తం వేలంలో లభించింది.
పీ7 నెంబరుకు పలికిన రూ.122 కోట్లు.. మిగిలిన నెంబర్లకు రూ.101 కోట్లు కలిపితే రూ.223కోట్ల భారీ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే మొత్తం వేలాన్ని చూస్తే.. ఒక్క కారు నెంబరుకు పలికిన ధర.. వేలంలో మిగిలిన ఫ్యాన్సీ నెంబర్లు మొత్తానికి పలికిన మొత్తం కంటే అధికంగా ఉండటం విశేషం. కారు నెంబరు కోసం ఇంత భారీగా ధర పలకటం గతంలోనూ ఒకసారి చోటు చేసుకుంది. అయితే.. తాజాగా జరిగిన వేలం ధర కంటే తక్కువే. తాజా వేలం ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
సుమారు పదిహేనేళ్ల క్రితం (2208) అబుధాబిలో ‘‘1’’ నెంబరును సొంతం చేసుకోవటానికి నిర్వహించిన వేలంలో 52.2 మిలియన్ దిర్హామ్ ల ధరకు ముగిసింది. ఆ తర్వాత ఇంత భారీ మొత్తానికి (55 మిలియన్ దిర్హామ్ లు) కారు నెంబరు పలకటం ఇదేనని చెబుతున్నారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో వచ్చిన భారీ మొత్తాన్ని ‘వన్ బిలియన్ మీల్స్’ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటించే ప్రజల కోసం వన్ బిలియన్ మీల్స్ ను అందించనున్నారు. ఈ కార్యక్రమానని దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రారంభించిన విషయం తెలిసిందే.