ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో రోగులు చనిపోయిన ఘటనలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారును హైకోర్టు గతంలో ఆదేశించింది. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయినప్పటికీ ఏపీ సర్కార్ ఆక్సిజన్ సరఫరా విషయంలో జాగ్రత్తలు చేపట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. రుయాలోని కోవిడ్ ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో దాదాపు 1000 మందికి చికిత్స పొందుతున్నారని, అక్సిజన్ ప్రెషర్ పెరగడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు.
5 నిమిషాలపాటు రోగులకు ఆక్సిజన్ అందలేదని, ఆ తర్వాత వెంటనే ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, ఆ కొద్దిసేపు ఆక్సిజన్ లేక 11 మంది మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. సాంకేతిక సమస్య ఏమీ లేదని, ఆక్సిజన్ ఆలస్యంగా రావడంతో ఇబ్బంది ఏర్పడిందన్నారు.
బల్క్ ఆక్సిజన్ ద్వారా పునరుద్ధరించామని, ఈ లోపే 11 మంది చనిపోయారని కలెక్టర్ తెలిపారు. ఈ వార్తతో తిరుపతిలో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా ఏర్పడింది. వార్త తెలుసుకున్న రోగుల కుటుంబసభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆస్పత్రికి చేరుకున్నారు.
అయితే, మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా జరగలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఆక్సిజన్ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు. ఆస్పత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన చేపట్టి, ఐసీయూలోని వస్తువులను పగులగొట్టడంతో ఉద్రిక్తతతో ఏర్పడిందని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఆస్పత్రిలోని డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది.
మరోవైపు, రుయా ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రుయాలో ఆక్సిజన్ అందక 11మంది మరణించడం బాధకారమన్నారు. ప్రభుత్వం అక్రమ కేసుల మీద పెట్టిన శ్రద్ధ.. ఆక్సిజన్ సరఫరాలో చూపడంలేదని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆక్సిజన్ అందక పలువరు చనిపోతున్న వరుస ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కోవిడ్ రోగులను కాపాడాలని, ఆక్సిజన్ అందక రోజుకో జిల్లాలో కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. 10 రోజుల్లో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈ ఘటనై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.