ప్రపంచానికి వణుకు పుట్టించి.. చెమటలు కార్పించిన కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమన్న మాట బలంగా వినిపించిన వేళ.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ మొదలు పెట్టాయి. అగ్రరాజ్యాలతో పోలిస్తే.. భారత్ లో కాసింత ఆలస్యంగానే వ్యాక్సినేషన్ మొదలైంది.
వ్యాక్సినేషన్ లో జరిగిన ఆలస్యానికి సెకండ్ వేవ్ మూల్యం చెల్లించామన్న ఆరోపణ ఉంది. అయితే.. పలు దేశాల్లో అమలైన వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో పోలిస్తే మనం చాలా తోపులమన్న భావన కలిగేలా చేస్తుంది.
తాజాగా వంద కోట్ల వ్యాక్సినేషన్ మార్కును మోడీ సర్కారు సాధించింది. వ్యాక్సినేషన్ లో దారుణంగా ఇమేజ్ దెబ్బ తిన్న మోడీ సర్కారు.. తాజాగా వంద కోట్ల వ్యాక్సినేషన్ మార్కుతో తాను పోగొట్టుకున్న ఇమేజ్ ను మళ్లీ వెనక్కి తెచ్చుకుంటున్నట్లుగా చెప్పాలి.
అదెలానంటే.. అగ్రరాజ్యమైన అమెరికాలో వేసిన వ్యాక్సిన్ డోసుల కంటే ఇండియాలో రెట్టింపు కావటం.. జపాన్ లాంటి ధనిక దేశంలో వేసిన వ్యాక్సిన్ల కంటే ఐదు రెట్లుఎక్కువగా.. జర్మనీ కంటే తొమ్మిది రెట్లు.. ఫ్రాన్స్ తో పోలిస్తే 10 రెట్లు అధికంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగటం గమనార్హం.
గురువారం ఉదయానికి దేశంలోవ్యాక్సినేషన్ కార్యక్రమంలో చరిత్రను క్రియేట్ చేసింది. దేశ జనాభాలో వ్యాక్సినేషన్ తీసుకునేందుకు అర్హులైన 75 శాతం మంది కొవిడ్ మొదటి వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జమ్ము కశ్మీర్..లఢఖ్.. ఉత్తరాఖండ్.. సిక్కిం.. హిమాచల్ ప్రదేశ్.. దాద్రా నగర్ అండ్ హవేలీ.. డామన్ అండ్ డ్యూ.. గోవా.. లక్షద్వీప్ లలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావటం గమనార్హం.
ఇక.. నాలుగు రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. తొమ్మిది నెలల పాటు సాగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎట్టకేలకు వంద కోట్ల మార్కును సాధించటం గొప్ప విషయంగా చెప్పాలి. తాము సాధించిన రికార్డును భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది.
ఏ కరోనా కారణంగా.. ఏ వ్యాక్సినేషన్ సరిగా జరగలేదన్న విమర్శలతో డ్యామేజ్ అయిన మోడీ సర్కారు ఇమేజ్.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుండటం విశేషం. ఈ ఏడాది జనవరి 16న అంటే సంక్రాంతి పండుగ వేళలో మొదలైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ రోజున చారిత్రక రికార్డును క్రియేట్ చేసినట్లైంది.
ఇదిలా ఉంటే.. దేశం మరెంత మందికి టీకాలు ఇవ్వాల్సి ఉందన్నది ఆసక్తికర ప్రశ్న. సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం చూస్తే దేశంలో టీకా వేయించుకోవటానికి అర్హులైన భారతీయుల సంఖ్య 94.47 కోట్లు. వారికి వేయాల్సిన డోసులు 188.94 కోట్లు. తాజాగా 100 కోట్ల డోసులు పూర్తి అయితే.. మరో 88.94 కోట్ల డోసులు మిగిలి ఉంది. అంటే.. ఇప్పుడు మనం ఇంకా 47.07 శాతం లక్ష్యానికి దూరంగా ఉన్నామని చెప్పాలి.
ఏదేమైనా ఇప్పటికే కరోనా చాలామందికి వచ్చిపోయిన నేపథ్యం, 53 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇవన్నీ చూస్తుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చని, వచ్చినా దాని ప్రభావం ఉండకపోవచ్చనే అంటున్నారు.