నవ్యాంధ్రలో జగన్ జమానాలో ఇసుకను అడ్డగోలుగా దోపిడీ చేశారు. గనుల శాఖలో డైరెక్టర్‌గా పనిచేసి.. అరెస్టు భయంతో విదేశాలకు పరారైన వీజీ వెంకటరెడ్డి ఈ వ్యవహారంలో పైకి కనిపిస్తున్న వ్యక్తి. వెనుక ఉండి మొత్తం నడిపింది తాడేపల్లి ప్యాలెసేనన్న సత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. తవ్వకాలు-విక్రయాల కాంట్రాక్టుల్లో వెంకటరెడ్డి నామమాత్రుడని.. దందా నడిపింది జగన్ నివాసమేనని.. ఈ కుంభకోణం రూ.10 వేల కోట్లపైనే ఉందని స్వయంగా గనుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం, ఏసీబీ ముందున్న టెండర్లు, ఒప్పంద పత్రాల ఆధారంగానే విచారణ చేస్తే.. రూ.2,586 కోట్ల అక్రమాలే బయటకు వస్తాయి.
అదే తెరచాటు తాడేపల్లి దోపిడీ గురించి కూడా అవినీతి అనకొండలు బయటకొస్తాయని, మరో రూ.10 వేల కోట్లపైనే దోపిడీ బట్టబయలవుతుందని అంటున్నాయి. తాడేపల్లి ‘క్విడ్ ప్రో కో’ మాస్టర్‌మైండ్ గుట్టును బయటకు లాగాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్ 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేశారు. ఆ ఏడాది సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానమే అమలు చేశారు. తర్వాత ఉచితాన్ని ఎత్తివేసి అమ్మకం విధానం తీసుకొచ్చారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్‌గా వచ్చారు.
2021 మే నుంచి 2023 మే వరకు రెండేళ్ల కాలపరిమితితో ఇసుక తవ్వకం, అమ్మకం కాంట్రాక్టును జగన్ సర్కారు జేపీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టింది. టెండర్లు ఏపీలో కాకుండా బెంగాల్లో నిర్వహించింది. పేరుకే జేపీ వెంచర్స్.. తవ్వకాలు, దందా అంతా అనధికారికంగా జరిగాయి. వైసీపీ నేతలు రీచ్‌లు, నదులు, వాగులు, వంకలపై పడి ఇసుకను తోడేసుకున్నారు. జేపీ వెంచర్స్‌ను ముందుపెట్టి వైసీపీ ముఖ్యనేతే తాడేపల్లి నుంచి ఇసుక దందా నడిపించారు. ఉమ్మడి జిల్లాలవారీగా సొంత పార్టీ నేతలకు అనధికారికంగా ఇసుక కాంట్రాక్టు ఇచ్చారు.
అయితే ఇవి దానంగానో, ధర్మంగానే ఇవ్వలేదు. ప్రతి నెలా 20-25 కోట్ల చొప్పున తాడేపల్లికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నాక కాంట్రాక్టు ఇచ్చారు. ఇలా చేజిక్కించుకున్నవారిలో అప్పటి ఎమ్మెల్యేలు ఆరుగురు, ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. ముందుగా అనుకున్న తేదీలోపు పేమెంట్లు రావాలి. లేదంటే పెనాల్టీలు విధించేవారు. తాడేపల్లి చె ల్లింపుల ఒత్తిళ్లు భరించలేక ఓ ఇసుక కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నారు కూడా. ఈ ఉదంతంతోనే తాడేపల్లి దందా తీవ్రత బయటి ప్రపంచానికి తెలిసింది. అయినా ఎవరూ లక్ష్యపెట్టలేదు. చెల్లింపులు కొనసాగాయి.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఒత్తిడి భరించలేక ఇసుక వ్యాపారాన్ని వదిలేసుకుని తాడేపల్లి ప్యాలెస్ సూచించిన వారికి అప్పగించారు. ప్రతి నెలా తాడేపల్లికి 260 కోట్లమేర చేరేవని చెబుతున్నారు. అంటే మూడున్నరేళ్ల కాలంలో ఇసుకను అనధికారికంగా అమ్ముకున్నవారు తాడేపల్లికి చెల్లించిన కప్పమే 7,800 కోట్లపైన ఉంది. సగటున నెలకు 20 కోట్ల లెక్క తీస్తేనే ఈ విలువ వస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల నుంచి 25 కోట్లు వస్తే.. మరికొన్ని జిల్లాలు 20 కోట్లమేర చెల్లింపులు చేశారు. తాడేపల్లికే నెలకు ఇంతగా చెల్లింపులు జరిపితే ఇసుక వ్యాపారం చేసిన వైసీపీ నేతలకు నెలకు ఎంతగా మిగిలిందో ఊహించవచ్చు.
ఇది లెక్క వేస్తే మూడున్నరేళ్ల వ్యవధిలో 10 వేల కోట్లపైనే దోపిడీ తేలుతోంది. ఎవరి వాటాలు వారికి ఇచ్చాక.. తమ ఆదాయం పెంచుకోవడానికి కాంట్రాక్టర్లుగా ఉన్న నేతలు ఇసుక రేట్లను అమాంతం పెంచేశారు. 18 టన్నుల ఇసుక లారీని 45వేలపైనే విక్రయించారు. ఇసుకకు కొరతే లేని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ధరలను అకాశానికి తీసుకెళ్లారు. మొత్తం ఇసుక వ్యాపారాన్నే సిండికేట్ చేసి దందా నడిపారు. ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు ఇసుక ను తరలించి సొమ్ముచేసుకున్నారు. ఇదేదీ గనులశాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లు, నివేదికల్లో కనిపించదు.
కానీ, అధికారిక దోపిడీ కంటే ఇదే చాలా పెద్ద కుంభకోణం. ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు.. డబ్బు సంపాదనే ధ్యేయంగా.. ప్రజలకు ఉచిత ఇసుకను దూరం చేసి అమ్మకం సరుకుగా మార్చుకుని దందా సాగించారు. ఇసుక లభించక భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. నిర్మాణరంగం కుదేలవడంతో ఉపాధితో పాటు ఆదాయమూ పడిపోయింది. కానీ ప్యాలెస్ అధినేతకు రూ.9 వేల కోట్లపైనే చేరింది. ప్రజలను, ప్రభుత్వాన్ని నష్టపరచి వైసీపీ నేతలు చేసిన దోపిడీలోని ఈ కోణాన్ని కూడా వెలికితీయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. వెంకటరెడ్డి పాత్రతోపాటు తాడేపల్లి ప్యాలెస్ పాత్రను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంకటరెడ్డి స్కెచ్చే స్కెచ్చు!
జాతి సంపదైన సహజ వనరులను కాపాడాల్సిన నాటి సీఎం జగన్.. ఇసుక తవ్వకాలను అక్రమ పద్ధతుల్లో అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టారు. ఇవేవీ పైకి కనిపించవు. ఎందుకంటే.. ఈ అక్రమాలను పరాక్రమంగా తీర్చిదిద్దిన ఘనత గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిదే. ఇసుక తవ్వుకునే కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థలు చిక్కుల్లో పడకుండా ఆయన భారీ స్కెచ్చే వేశారు. ఈ అక్రమాలపై రేపు ఎవరైనా తీగలాగితే.. గనుల శాఖ జిల్లా స్థాయి అధికారుల వద్దే డొంక కదులుతుంది.. వారిపైనే భారం పడుతుంది.
డైరెక్టర్ సార్ చెప్పారంటూ.. అనుమతులు ఇచ్చేసిన జిల్లా గనుల అధికారులు(డీఎంజీవో)లకు కూడా తెలియనంతగా ఈ అక్రమాలు సాగించడం.. ఈ స్కెచ్ వెనుక ఉన్న కీలక కుట్ర. జేపీ వెంచర్స్ తర్వాత 18 జిల్లాల్లో తవ్వకాలను తెలంగాణకు చెందిన ప్రతిమ ఇన్ఫ్రాకు, మరో 8 జిల్లాల్లో తవ్వకాలను చెన్నైకి చెందిన జీసీకేసీకి కాంట్రాక్టు ఇచ్చారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు దక్కించుకున్న ఆ రెండు సంస్థలే ఇసుక తవ్వకాలకు గనుల శాఖ నుంచి అనుమతి, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ(సియా) నుంచి పర్యావరణ అనుమతి, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నుంచి కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్(సీటీఓ), కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్(సీటీఈ)లు తీసుకోవాలి.
దీనికి అవసరమైన ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీలు ఆ కంపెనీలే ప్రభుత్వ సంస్థలకు చెల్లించాలి. అయితే ఇవన్నీ జగన్ అస్మదీయ కంపెనీలు కావడంతో వాటిపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వ పెద్దలు గీతోపదేశం చేశారు. దీంతో వెంకటరెడ్డి భారీ స్కెచ్ సిద్ధం చేసి.. పెద్దల మన్ననలు పొందారు. మైనింగ్, పర్యావరణ అనుమతులు(ఈసీ), పీసీబీ ఇచ్చే సీటీవోలను డీఎంజీవోల పేరిట దరఖాస్తు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రీచ్‌ల్లో మాన్యువల్ మైనింగ్(మనుషులతో ఇసుక తవ్వించడం) అనుమతి కోసం ఆయా జిల్లాల డీఎంజీవోలతో సియాకు, పీసీబీకీ, గనుల శాఖలకు దరఖాస్తులు పెట్టించారు.
ఇలా ఒక్కో రీచ్‌కు రూ.25 వేలు రెమ్యునరేషన్ చార్జీలు, రూ.లక్ష బ్యాంకు గ్యారంటీ, రూ.20 వేల వరకు దరఖాస్తు ఫీజు కింద అధికారులే చెల్లించేలా ప్లాన్ వేశారు. అయితే, ఇది అధికారులు సొంతంగా భరించలేరు కాబట్టి, ఏపీఎండీసీ నుంచి రూ.3.42 కోట్లు వాడుకున్నారు. గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న వెంకటరెడ్డే ఏపీఎండీసీ ఎండీగా కూడా ఉన్నారు. తనకు తానే లేఖలు రాసుకుని నిధులు మళ్లించారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎంజీవోల పేరిటే అనుమతులు తీసుకున్నారు. అధికారుల పేరిట తీసుకున్న లీజుల్లో 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, మరో 8 జిల్లాల్లో జీసీకేసీ తవ్వకాలు చేపట్టాయి.
ఆ రెండు కంపెనీల అక్రమాలు!
మాన్యువల్ మైనింగ్ పేరిట అనుమతులు తీసుకొని ఆ రెండు కంపెనీలు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. సగటున 2 టన్నుల సామర్థ్యం ఉన్న జేసీబీలను వినియోగించి ఇసుకను తోడేశారు. ఒక మీటర్ వరకే తవ్వాల్సిన చోట 4-5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. పర్యావరణాన్ని గుల్లచేశారు. స్వయంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖల శాస్త్రవేత్తల బృందం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్న అక్షర సత్యాలివి.
నదీ ప్రవాహ గమనాన్ని మార్చేలా రీచ్‌ల్లో కిలోమీటర్ పొడవున తవ్వకాలు చేశారని కూడా నివేదించారు. ఈ రెండు కంపెనీలు అక్రమ తవ్వకాలు చేశాయని ఎన్జీటీ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా నివేదికలు ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరాయి. అధికారుల పేరిట అనుమతులు పొందిన రీచ్‌ల్లో ఆ రెండు కంపెనీలు అక్రమ తవ్వకాలు జరిపాయని నిగ్గు తేలింది. కాబట్టి అవి చేసిన అక్రమాలకు తొలుత చర్యలు ఎదుర్కొనేది గనుల శాఖ జిల్లాల అధికారులే. ఎందుకంటే మైనింగ్, పర్యావరణం, సీటీఈ, సీటీవో అనుమతులు వారిపేరిటే ఉన్నాయి. కాబట్టి కోర్టు ముందు వారు దోషులుగా నిలబడాల్సి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే… అనుమతులు పొందిన వారే అక్రమ తవ్వకాలు జరగకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు ఆదేశాలు ఉన్నాయి. కానీ, ఆ రెండు కంపెనీలు పర్యావరణ విధ్వంసం చేశాయు. నదుల ప్రవాహ గతి మారేలా తవ్వకాలు చేశాయి. ఆ రెండు కంపెనీలు నదులను అక్రమంగా తోడేస్తుంటే.. జిల్లా అధికారులు ఏం చేశారని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. అక్రమ తవ్వకాలను ఎందుకు అడ్డుకోలేకపోయారు? అన్న కోణంలో బాధ్యులెవరంటే కంపెనీలకన్నా ముందు అధికారులే ముందువరసలో ఉంటారు. ఇందులో ఎక్కడా తన పాత్ర కనబడకుండా, జిల్లా స్థాయి అధికారులను ఇరికించేలా వెంకటరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఎట్టకేలకు వెంకటరెడ్డి అరెస్టు!
కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి.. కోస్ట్‌గార్డ్‌లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. గనుల శాఖను సర్వనాశనం చేసి.. కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లారు. తనకున్న పరిచయాలతో చెన్నై పోర్టుగుండా గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. తనకు ఉచ్చుబిగియడం.. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తారని కోస్ట్‌గార్డ్ ్డ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో.. అంతే గుట్టుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏసీబీ అధికారులకు ఉప్పందడంతో హైదరాబాద్ వెళ్లి.. సెప్టెంబరు 26వ తేదీ సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకుని.. మర్నాడు వేకువఝామున బెజవాడకు తీసుకొచ్చారు. బయటకు కనిపించకుండా వేలకోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డి, అందులో సింహ భాగం తాడేపల్లి ప్యాలె్‌సకు చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాల నిగ్గు తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ….కడప, తిరుపతి, విజయవాడతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది.
అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆదిశగా ఏసీబీ నిఘా పెట్టింది. విచారణకు హాజరవ్వాల్సిందిగా 41ఏ నోటీసుతో విజయవాడ, కడప, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో రెండు వారాల క్రితం వెతికింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు నిరాకరించింది. విదేశాలకు పారిపోయినా.. పోలీసులు వదలరని తేలడంతో దిక్కుతోచక కాళ్లబేరానికి వచ్చారు. మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని, అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో వెంకటరెడ్డి ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.