ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంటే…మరోవైపు ప్రభుత్వం ఉదాసీనత వల్ల కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. పేలుడుధాటికి పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
ముగ్గురాళ్లను పగులగొట్టేందుకు వినియోగించే డిటోనేటర్లను క్వారీలో ఒకచోటి నుంచి మరొకచోటికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉండడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితుల తరహాలోనే వీరికి కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.