ముందుతరం నటుల్లో రావు గోపాల్‌రావు ఎంత గొప్ప నటుడో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ పాత్రల్లో టిపికల్ స్టయిల్లో సాగే ఆయన అభినయం.. డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మేటి నటుడి కొడుకైనప్పటికీ.. ఎప్పుడూ, ఎక్కడా తండ్రి పేరు వాడుకోలేదు రావు రమేష్. ఒక కొత్త నటుడిలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలతోనే మంచి పేరు సంపాదించాడు. ఆపై టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్‌గా ఎదిగారు. ఇతర భాషల వాళ్లు కూడా ఆయన ప్రతిభను గుర్తించి అవకాశాలిస్తున్నారు.
ఎన్నో సినిమాల విజయంలో తన వంతు పాత్ర పోషించిన రావు రమేష్.. ఇప్పుడు హీరో అవతారం ఎత్తుతున్నారు. హీరో అంటే కమర్షియల్ సినిమాల్లో చూసే టైపు హీరో కాదు. రాబోయే ఓ సినిమాలో ఆయనదే లీడ్ రోల్. ఆయన పాత్ర పేరే సినిమా టైటిల్ కావడం విశేషం.
‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’.. రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న కొత్త చిత్రం. ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం అట. పూర్తి వినోదాత్మకంగా ఉంటుందట. ఆ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పాత్రను పోషించనున్నది రావు రమేషే.
ఇంతకుముందు మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారిక ప్రధాన పాత్రలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా తీసిన లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. రావు రమేష్‌కు జోడీగా సీనియర్ నటి ఇంద్రజ నటించనుంది. పీబీఆర్ సినిమాస్ ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడమే మా తొలి సక్సెస్. కథ, పాత్ర నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పాడు. చిన్న పాత్రలతోనే మంచి ఇంపాక్ట్ వేసే రావు రమేష్.. తనే లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి మరి.