అందుకే అంటారు.. ఎవరు తక్కువ తినలేదని. ఎవరికి వారు తోపులుగా ఫీలయ్యే రాజకీయ రంగంలో.. ఎవరికి వారు తిరుగులేని మొనగాళ్లుగాచెలామణీ అవుతుంటారు. ఎవరికి వారు తమ గొప్పల్ని చెప్పుకునే నేతలు ఉంటారు. అందుకు భిన్నంగా.. తమ గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఇష్టపడని ప్రముఖులు కొందరు ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొందరు ముఖ్యమంత్రులు తమ మాటలతో ప్రజల్ని మంత్రుమగ్దుల్నిచేస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కోవలోకే వస్తారు. అయితే.. ఆయన మాదిరే చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారని.. కాకుంటే అవగాహన లేక.. కేసీఆర్ ఒక్కరే అని ఫీల్ అవుతామన్న భావన కలిగేలాచేయటంలో.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమ్ బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయించిన తెలంగాణ రాష్ట్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా విలేకరుల సమావేశానికి హాజరైన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంచ్ వేసేలా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ ఒక పిట్ట కథ చెప్పారు. అది కూడా కేసీఆర్ కు అని పేర్కొనటం గమనార్హం. ఆయన ఏమన్నారంటే.. ‘‘నీకో కథ చెప్తా.. విను కేసీఆర్. ఒక ఋషి ఎలుకను పులిని చేసినట్టు.. నిన్ను ప్రజలు సీఎం చేస్తే.. వారిపైనే అన్యాయంగా కేసులు పెడతావా.? ఇంకా తెలంగాణను ఎంత దోచుకుంటావ్.. ప్రజలు పులిని.. తిరిగి ఎలుకగా చేయాల్సిన సమయం వచ్చేసింది.
నీకుదమ్ము ఉంటే మమ్మల్ని తొక్కి చూపెట్టు కేసీఆర్’ అంటూ ఫైర్ అయ్యారు. ఏ మాటకు ఆ మాటే.. సీఎం కేసీఆర్ కు కొత్త అనుభవం కలిగేలా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన పిట్టకథ ఉందని చెప్పాలి.