సీఎం జగన్ పాలనపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని, ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ మహిళా నేత, పర్యాటక శాఖా మంత్రి రోజా స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను రోజా తప్పు పట్టారు.
జగన్ పాలన సజావుగానే సాగుతోందని, అటువంటిది ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని రోజా అన్నారు. బాలకృష్ణ స్క్రిప్ట్ చూసి ఆ కామెంట్లు చేశారో లేక తెలియక మాట్లాడారో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించారు. జీవో నెంబర్ ఒకటిని పూర్తిగా చదివితే బాలకృష్ణ తన వ్యాఖ్యలను తప్పకుండా ఉపసంహరించుకుంటారని చెప్పారు. దాన్ని చదవకుండా ఎమర్జెన్సీ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు.
సినిమా తరహాలో డైలాగులు చెబితే చప్పట్లు కొడతారని, కానీ, ప్రజా సమస్యలు తీరవని రోజా విమర్శించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 11మంది చనిపోయినప్పుడు బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని రోజా అన్నారు. తన కూతురు, అల్లుడు బాగుండాలని, బావ కళ్లలో ఆనందం చూడాలని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రోజా అభిప్రాయపడ్డారు. అన్ స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పై చర్చ కూడా స్క్రిిప్ట్ ప్రకారమే జరిగిందని ప్రజలు అనుకుంటున్నారని రోజా చెప్పారు. మరి రోజా వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.