ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, జైల్లో ఉండగానే ఆయనపై నమోదు అవుతున్న తదుపరి కేసుల వివరాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుల నమోదు, అరెస్టు, విచారణ పరంపరలో ఏపీలోని పోలీస్ అధికారులు, పోలీసులు , సిబ్బంది మదిలో తెలంగాణ క్యాడర్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ మెదులుతున్నారట. ఆయనకు ఓ కేసు విషయంలో ఎదురైన పరిస్థితి తమకు గొప్ప గుణపాఠం అని వారు పేర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు విచారణ- ఎన్కౌంటర్ సమయంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించిన సంఘటన తెలిసింది. అయితే దిశ ఎన్కౌంటర్ బూటకం అని పేర్కొంటూ బాధితుల కుటుంబాల చెందిన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ జరగడం తెలిసిన సంగతే. కేసు క్లోజ్ అయిన విషయంలో క్రెడిట్ తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుకు దక్కగా సమస్యలు మాత్రం సజ్జనార్‌తో పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొన్నారు. స్వయంగా సజ్జనార్ సైతం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాల ఎపిసోడ్లో భాగమైన అధికారుల & సిబ్బంది తమకు సైతం ఇలాంటి పరిస్థితి తప్పదేమోనని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు సంగతి తేల్చేందుకు ఏపీ సీఎం జగన్ ముందుకు సాగుతుండటం, అందులో భాగంగా చంద్రబాబుపై కేసుల మీద కేసులు నమోదు అవుతూ ఉండటం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తు ప్రక్రియల్లో తాము సైతం ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని దీనికి దిశా ఎన్కౌంటర్ తదనంతర పరిణామాలే నిదర్శనమని పోలీసు అధికారులు, సిబ్బంది అంతర్గతంగా వాపోతున్నట్లు సమాచారం.