తాను లక్ష్యంగా చేసుకున్న వారిని తుదకంటా తొక్కేసే విషయంలో మోడీషాలు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. నిజానికి అదే వారి బలంగా చెప్పాలి. తమను ఎదురు తిరిగే వారిని తొక్కేయటం తెలిసిన మోడీషాలకు.. తమ ఎదుగుదలకు పనికి వస్తారన్నప్పుడు ఎవరినైనా సరే వాడేసే విషయంలో అస్సలు మొహమాటపడరని చెప్పాలి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుందని చెప్పాలి.
ఏపీ ముఖ్యమంత్రి సోదరి.. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నతో పడకపోవటం.. బయటకు రాని ఇంటి లెక్కల తేడాలతో సొంతంగాపార్టీ పెట్టేయటం తెలిసిందే. మొదట్లో ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు ఆసక్తిని రేకెత్తించినా.. ఆమెకున్న పరిమితుల కారణంగా.. ఎవరూ ఆమె వద్ద రావటానికి ఇష్టపడని పరిస్థితి. వ్యక్తిగతంగా వైఎస్ ను.. ఆయన కుటుంబాన్ని అమితంగా అభిమానించి.. ఆరాధించే నేతలు పలువురు షర్మిల పార్టీ వైపు కన్నెత్తి చూసింది లేదు.
ఈ కారణంతోనే ఆమె ఎంతలా శ్రమిస్తున్నా.. ఆమె ఆశించినంత ఫలితం రాని పరిస్థితి. ఇలాంటి వేళ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు.. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పిన షర్మిల ఆందోళబాట పట్టటం.. దీన్ని ఏ మాత్రం ఇష్టపడని ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే ఆమె విషయంలో తామెంత కర్కశంగా వ్యవహరిస్తామన్న విషయాన్ని చేతల్లో చూపించేశారు.
జనాదరణ ఉన్న అధినేత్రిగా.. ఘనమైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాజకీయ కుటుంబానికి చెందిన మహిళను.. పార్టీ అధ్యక్షురాలు కారులో ఉండి బయటకు రాలేదన్న కోపంతో టోయింగ్ వెహికిల్ తో లాక్కెళ్లిన వైనం.. ఆ తర్వాత కారు అద్దాల్ని బద్దలు కొట్టించి మరీ ఆమెను అదుపులోకి తీసుకోవటం లాంటివి చూసినప్పుడు.. రెండు విషయాలు అర్థమవుతాయి.
తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా వ్యవహరిస్తారన్నది ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో షర్మిల సైతం తానెంత పట్టుదల ఉన్న వ్యక్తిని అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారని చెప్పాలి. మహిళ అన్నంతనే కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. అయితే.. తాను మాత్రం అలాంటి వాటికి అతీతమన్న విషయాన్ని ఆమె తన తీరుతో ఫ్రూవ్ చేశారని చెప్పాలి.
ఈ తెగువ ప్రధాని నరేంద్ర మోడీ కంట్లో షర్మిల పడేలా చేసిందంటున్నారు. కేసీఆర్ మీ తాము ఎక్కువ పెట్టిన అస్త్రానికి షర్మిల బాణాన్ని కూడా కలిపితే మెరుగైన ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చన్నది మోడీషాల ఆలోచనా? అన్నది ఇప్పుడు ప్రశ్న.
నిరసన వ్యక్తం చేసే క్రమంలో కారులోనే ఉండిపోయి.. కిందకు దిగేందుకు ససేమిరా అనటమే కాదు.. టోయింగ్ వెహికిల్ తో కారును లాక్కెళ్లిపోతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రదర్శించిన పట్టుదల ఇప్పుడు షర్మిలకు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టిందని చెప్పాలి.
దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన షర్మిలను చూసినప్పుడు ఆమె బీజేపీ వదిలిన బాణం అనటానికి సరైన ఆధారాలు లేవనే చెప్పాలి. దీనికి కారణం.. తన పాదయాత్రలో అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని మాత్రమే కాదు.. కాంగ్రెస్.. బీజేపీ నేతల్ని సైతం లక్ష్యంగా చేసుకోవటం.. వారిని ఉతికి ఆరేయటం లాంటివి చేసేందుకు అస్సలు మొహమాట పడలేదన్నది మర్చిపోకూడదు.
తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయటం కోసం.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం కావటం.. ఎవరినైనా సరే.. మొహమాటం లేకుండా కడిగి పడేసే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను షర్మిల సొంతం చేసుకున్నారు. ఆమెకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని పరిగణలోకి తీసుకొని షర్మిలను గులాబీ దళం తాజాగా టార్గెట్ చేయటం తెలిసిందే. కారు టోయింగ్ ఎపిసోడ్ లో అనూహ్య ఇమేజ్ ను సొంతం చేసుకున్న షర్మిలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా రియాక్టు కావటం ఆసక్తికరంగా మారింది.
రాజకీయంగా షర్మిల స్థాయి ఏమిటి? ఆమెకున్న బలం ఏమిటి? లాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమెకు ప్రధాని మోడీ ఫోన్ చేయటం.. కారు టోయింగ్ ఎపిసోడ్ గురించి అడిగి తెలుసుకోవటం చూసినప్పుడు.. ఆమెకు ఇమేజ్ భారీగా పెరిగిపోయిందన్న ప్రచారం మొదలైంది.నిజంగానే ఆమెకు ఇమేజ్ పెరిగిందా? అంటే లేదనే చెప్పాలి. ఇమేజ్ కంటే కూడా సానుభూతి వచ్చింది. దాన్లో వాటా తీసుకునేందుకు మోడీ అస్సలు వెనుకాడలేదు.
మరోవైపు ఢిల్లీకి రావాలని.. వచ్చి కలవాలన్న ఆహ్వానం అందినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్నది చూస్తే.. లాభం మోడీ మాష్టారికి.. నష్టం షర్మిలకు అన్న విషయం ఇట్టే బోధ పడుతుంది. కారణం.. షర్మిల బీజేపీ వదిలిన బాణం అన్న మాటలో నిజం లేకున్నా.. తాజా పరిణామాలు అదంతా నిజమేనన్న భావన కలుగుతుంది. ఇది షర్మిల రాజకీయానికి నష్టం వాటిల్లేలా చేస్తుంది. అదే సమయంలో కేసీఆర్ దుర్మార్గాల మీద పోరాడుతున్న తాము.. ఎంత విశాలమైన మనసు ఉందన్న విషయాన్ని చెప్పినట్లుగా అవుతుంది.
మోడీ అండ్ కోకు షర్మిల దగ్గరయ్యే కొద్దీ.. ఆమె గళంలో వాడితనం తగ్గుతుందన్నది మర్చిపోకూడదు. ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ పోవటమే తన లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే షర్మిలకు బీజేపీతో పెరిగే బంధం.. ఆమె కాళ్లకు ముందర బంధనాలుగా మారతాయన్నది మాత్రం మర్చిపోకూడదు.
తమ ప్రయోజనం తప్పించి మిగిలిన విషయాల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోని మోడీషాల విషయంలో షర్మిల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. వారి గేమ్ ప్లాన్ లో ఆమె భాగమవుతుందన్నది మర్చిపోకూడదు. మరి.. ఆ విషయాన్ని షర్మిల గుర్తిస్తారా? అన్నదే అసలు ప్రశ్న.