‘వై ఏపీ నీడ్స్ జగన్’..ఏపీకి జగన్ మరోసారి ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పాలంటూ ప్రజలను కోరుతూ వైసీపీ సోషల్ మీడియా విభాగం నిన్న ఓటింగ్ కార్యక్రమం చేపట్టింది. అయితే, దానికి కౌంటర్ గా ‘వై ఏపీ నీడ్స్ జగన్’… ఏపీకి మరోసారి జగన్ ఎందుకు? అంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఓ రేంజ్ లో ట్రోల్ చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా తమ పార్టీ అధినేత పరువు తీసుకునేలా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే క్యాప్షన్ పెట్టారంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం సెటైర్లు వేసింది.
ఈ పుండు పచ్చిగా ఉండగానే తాజాగా ఆ కార్యక్రమం మీద ఏపీ హైకోర్టు కారం చల్లింది. ఆ కార్యక్రమంపై వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్, జీఏడీ సీఎస్, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ, వాలంటీర్ శాఖల ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల మీడియాముఖంగా పిలుపునిచ్చారని, వారిని పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీకి ఓటు వేసేలా ప్రజలను అధికారులు ప్రేరేపిస్తున్నారని, జగన్ ను పొగిడేందుకు కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని అన్నారు.
ఈ క్రమంలోనే సజ్జల, అధికారులకు హైకోర్టు నోటీసులిచ్చింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నడుమ ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నానా తంటాలు పడుతున్న వైసీపీ నేతలకు తాజాగా వచ్చిన నోటీసులు…మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా తయారయ్యాయి.