అరకు మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత, ప్రస్తుత బీజేపీ నేత కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.52 కోట్ల రూపాయల రుణం ఎగవేత కేసులో ఆమెను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి చెల్లించని నేపథ్యంలో ఆమెపై సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. కొత్తపల్లి గీత భర్త కోటేశ్వరరావు ఎండీగా ఉన్న విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కోసం తీసుకున్న రుణాన్ని కొత్తపల్లి గీత దంపతులు చెల్లించలేదు.
దీంతో, తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టారని కొత్తపల్లి గీతపై పోలీసులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో, 2015 జూలై 11న సీబీఐ అధికారులు కొత్తపల్లి గీతపై చార్జిషీటు దాఖలు చేశారు. కొత్తపల్లి గీతతో, ఆమె భర్త కోటేశ్వరరావు పేరుకూడా చార్జిషీట్లు చేర్చారు ఈ దంపతులతోపాటుగా బ్యాంకుకు సంబంధించిన పలువురు అధికారుల పేర్లు కూడా చార్జిషీట్లో సీబీఐ చేర్చింది. గీత దంపతులకు లోన్ ఇచ్చేందుకు వారు సహకరించారని ఆరోపించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసేందుకు కుట్రపన్నారని చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. లోను పొందేందుకు వాస్తవాలను కొత్తపల్లి గీత దంపతులు దాచి పెట్టారని సీబీఐ అధికారులు ఆరోపించారు. అంతేకాదు, బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా చార్జిషీట్లో అధికారులు పేర్కొన్నారు. లోను తీసుకున్న బ్యాంకు బెంగుళూరులో ఉన్నందున గీతను అక్కడికి తరలించనున్నారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కొత్తపల్లి గీతకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బెంగుళూరుకు తరలిస్తారు. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో గీత పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే గీత భర్తను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments 1