ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఆయన మృతి చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఆయన అనారోగ్యంతో చనిపోయారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ మరణం తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. వివేకా హత్యకేసు దర్యాప్తునకు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన సీబీఐ బృందా లు ఇటీవలే మళ్లీ కడప చేరుకున్నాయి. గత మూడు రోజులుగా పలువుర్ని విచారిస్తున్నాయి. రెండురోజుల కిందట పులివెందులలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కో ఆర్డినేట్స్ తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి మరణించటం చర్చనీయాంశమైంది.
కీలక సాక్షి.. ఎలాగంటే..
‘కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాం. ఆ నేరాన్ని నీపైన వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారు. నీ జీవితాన్ని సెటిల్ చేస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారని గతేడాది అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇది సీఎం జగన్ బాబాయ్ హత్య కాబట్టి, తేడా జరిగితే భవిష్యత్తులో ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించా నని ఆయన ఆ వాంగ్మూలంలో వివరించారు. తర్వాత ఏమైందో కానీ కొన్ని రోజులకే మాట మార్చారు.
శివశంకర్‌రెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్‌రెడ్డి మాటమార్చారనే అనుమానం తమకు ఉందని శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు సీబీఐ నివేదించింది. ‘గంగాధర్‌రెడ్డి మాకు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు గతేడాది నవంబరు 25న అంగీకరించారు. 27న వాంగ్మూలం నమోదు కోసం న్యాయస్థానంలో సీబీఐ తరఫున దరఖాస్తు చేశాం. 29న ఆయన మాట మార్చారు. శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ తనను బలవంతం చేసిందని, ఒత్తిడి తెచ్చిందంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనను శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేశారు’ అని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి మృతి అనేక అనుమానాలకు ఛాన్స్ కల్పించింది. మరి దీనిపై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.