రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయబోతున్నాననే దానిపై సీబీఐ మాజీ జాయింట్ డెరెక్టర్ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చేశారు.
రాబోయే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచీ లోక్‌సభ బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు.
తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచీ విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచీ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత కొంతకాలం రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించి తరువాత కొంతకాలం చాలా సైలెంట్ అయ్యారు. మధ్యలో లోక్‌సత్తా అంటూ వెళ్లినా ఏదీ వర్క్ అవుట్ అవలేదు.
కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఆయన తనకు ఇష్టమైన వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ్ల ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
విశాఖపట్నం నుంచీ ఆయన మళ్లీ పార్లమెంటు బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే స్వతంత్రగా పోటీ చేద్దామా లేదా ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున నిలబడాలా అనేదానిపైన ఆయన ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు.
నేను ఏ పార్టీ నుంచీ పోటీ చేస్తాననేదానిపైన సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతోందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అయితే నేను మాత్రం నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతానని చెప్పారు.
గత ఎన్నికల్లో తాను బాండు పేపర్ రాశానని, తాను ఎన్నికల్లో చెప్పినవి చేయలేకపోతే తనపైన క్రిమినల్ కేసులు పెట్టొచ్చని అందులో రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
రెండు రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగుంటుందని వైసీపీ తెరపైకి తీసుకొచ్చిన తాజా నినాదంపై ఆయన స్పందించారు.
రెండు రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర విభజన అంశం కోర్టులో నడుస్తోందని అన్ని పార్టీలూ కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యా ఉండదన్నారు.
ఇలా ఉండగా లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచీ పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఈ సారి ఎన్నికల్లో అయినా ఆయన గెలిచి చట్ట సభల్లోకి అడుగు పెడతారా లేరా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.