రాజమండ్రి మహానాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో వైసీపీ నేతలకు కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే వేదికపై నుంచి ‘‘భవిష్యత్తుకు గ్యారంటీ’’ అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమానికి ఈ నెల 10వ తేదీన చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజుకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ప్రతి ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరిపామని, కానీ నేడు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేని దుస్ధితిలో సీఎం జగన్ ఉన్నారని దుయ్యబట్టారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని సమన్యాయం చేయాలని టీడీపీ పోరాడిందని గుర్తు చేశారు. అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు.
తన హయాంలో జరిగిన ఒప్పందాలు కొనసాగి ఉంటే 30 లక్షల మందికి ఉపాధి లభించేదని గుర్తు చేశారు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అంగీకరించిందని, విజయవాడ-గుంటూరు మద్యలో రాజధాని ఉండాలని 30 వేల ఎకరాలుండాలని చెప్పారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నారని దుయ్యబట్టారు. 9 ఏళ్లయినా రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని దుస్ధితిలో ఉన్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి కేసుల మాఫీకి రాష్ట్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసులు లాలూచీ చేసేందుకు రాజ్యసభ సీట్లు అమ్ముకుని విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించడం మానేశారని నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో అప్పులు, అవినీతి, విద్వసం తప్ప అభివృద్ది లేదని, రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ధ్వజమెత్తారు.