హెచ్ సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో చెట్లు కొట్టివేతపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు అక్కడ వన్యప్రాణులు లేవని, అది ప్రభుత్వ భూమి అని రేవంత్ సర్కార్ చెబుతోంది. కానీ, అది హెచ్ సీయూ భూమి అని, అక్కడ వన్యప్రాణులున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ తెలంగాణ హైకోర్టుకు చేరింది.
అయితే, హైకోర్టు చెట్ల నరికివేతపై ఒక రోజు నిలిపివేత ఆదేశాలిచ్చినా అవి బేఖాతరయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 7 వరకు అక్కడ చెట్లు కొట్టవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 7వతేదీకి వాయిద వేసింది. నిన్న కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని పిటషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి ఆధారాలు సమర్పించారు. అంతేకాదు, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తున్న విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
విద్యార్థులను బలవంతంగా అక్కడ నుంచి పోలీసులు తరలిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే చెట్ల నరికివేతపై స్టే విధించిన హైకోర్టు…ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కాగా, ఆ 400 ఎకరాల భూములను చదును చేసి వాటిని ఐటీ కంపెనీలకు కేటాయించాలని రేవంత్ సర్కార్ భావిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వెస్ట్ డెవలప్మెంట్ కు ఆ భూములను ఉపయోగిస్తామని, 50 వేల కోట్ల ఆదాయం వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్ బయో డైవర్సిటీకి ఆ భూములు చాలా ముఖ్యమని, వాటిని పరిరక్షిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.