టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఇక అందరి అంచనాలను అందుకుంటూ నాటు నాటు ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో నిలిచింది. తొలిసారి ఓ తెలుగు పాట ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి సత్తా చాటింది. “నాటు నాటు…నాటు నాటు…ఊర నాటు…వీర నాటు అంటూ సాగిన తారక్, చెర్రీ వింటేజ్ స్టైల్లో వేసిన స్టెప్పులు వేసి అదరగొట్టారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయింది. ఎన్టీఆర్, చెర్రీలు నాటు నాటు అంటూ ఊరనాటు స్టెప్పులతో అదరగొట్టడంతో ఆ పాట ఆస్కార్ అవార్డు తప్పక గెలుస్తుందని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. షార్ట్ లిస్ట్ కావడంతో ఈ ఘనత సాధించిన భారత చలన చిత్ర తొలి పాటగా నాటు నాటు రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఆ పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లకు అరుదైన అవకాశం దక్కింది.
మార్చి 12న జరగనున్న ఆస్కార్ ( 95వ అకాడమీ అవార్డుల కార్యక్రమం) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘నాటు నాటు’ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ను ఆ ఇద్దరు సింగర్స్ కొట్టేశారు. తాజాగా ఈ విషయాన్ని రాహుల్ సిప్లిగంజ్ తప ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘‘ఇది నా జీవితంలో మరిచిపోలేని క్షణం’’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో, నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ సహా కీలక చిత్ర బృందం ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరుకానున్నాడు.