వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ పై విచారణ నేడు జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్, అరెస్టుపై ఈరోజు క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ, తాజాగా ఈరోజు ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి అరెస్టే లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు చేస్తోందని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేక్ అవుట్ పై సీబీఐ ఆధారపడుతోందని, హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా మార్చడం సీబీఐకి తగదని ఆయన వాదనలు వినిపించారు.
గూగుల్ టేక్ అవుట్ డేటాను ఏ కోర్టు సాక్ష్యంగా పరిగణించదని అన్నారు. అవినాష్ ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ జరుపుకోవచ్చని, గతంలో సుప్రీంకోర్టు కూడా ఇటువంటి ఆదేశాలు ఇచ్చిందని వాదించారు. ఈ హత్య కేసులో ఐదుగురు ఉన్నారని దస్తగిరి అరెస్టు అయిన వెంటనే చెప్పారని, ఆ వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ల పేర్లు లేవని నిరంజన్ రెడ్డి కోర్టుకు వెల్లడించారు.
ఆ తర్వాత ఇచ్చిన వాంగ్మూలంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల పేర్లను దస్తగిరి చెప్పారని వాదించారు. మరోవైపు, రక్తపు మడుగులో వివేకా కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరమని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏది ఏమైనా అవినాష్ ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందేమోనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.