బిగ్బాస్ రియాల్టీ షోపై కొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. యువతను పక్కదారి పట్టించేలా బిగ్బాస్ కంటెంట్ ఉందని.. వల్గారిటీని ప్రోత్సహించేలా ఈ షో ఉందని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరికి ఉపయోగమో నిర్వాహకులు సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలో చేసిన కామెంట్లు దుమారం రేపాయి. అంతేకాదు, హైకోర్టు కూడా ఈ షోపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇక, తాజాగా బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్-6 అట్టహాసంగా మొదలైన సందర్భంగా ఈ షోపై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో 100 రోజుల పాటు బూతుల స్వర్గంలో విలువైన సమయాన్ని వేస్ట్ చేసే బిగ్ బాస్ వచ్చేసిందని ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు వైరల్ గా మారాయి. సిగ్గు, ఎగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవని, అన్నాచెల్లెళ్లు కానోళ్లు, పిటపిటలాడే అందంతో ఉన్న ముక్కుముఖం తెలియని వాళ్లు… అచ్చోసిన ఆంబోతుల్లా ఈ షోలో పాల్గొంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమాజానికి ఉపయోగపడాల్సిన యువత దేశ సంపద ఉత్పత్తకి ఉపయోగపడకుండా, ఇలా బూతుల స్వర్గాన్ని ఉత్పత్తి చేస్తారా? అని నారాయణ ఫైర్ అయ్యారు. ఇలాంటి షోలను సిగ్గులేని ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో నుంచి తమకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రేక్షకులు అడగాలని నారాయణ అన్నారు.
పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన ఆంబోతుల్లా జీవించండని సందేశం ఇస్తారేమోనంటూ నారాయణ ఎద్దేవా చేశారు. కాసులకు కక్కుర్తిపడే సిగ్గులేని వ్యక్తులు ఉన్నంత కాలం ఈ పాపాలకు ఆదరణ ఉంటుందని సంచలన కామెంట్లు చేశారు నారాయణ. ద్రౌపదీ వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందంటూ పురాణేతిహాసాలను కూడా ఉదహరించారు. ఏది ఏమైనా, బిగ్ బాస్ , నాగార్జునలపై నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, ఈ వ్యాఖ్యలకు నాగ్ కౌంటర్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇక, కొద్ది రోజుల క్రితం చిరంజీవిపై విమర్శలు గుప్పించి…ఆ తర్వాత నారాయణ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.