ఓ పక్క విద్యుత్ కోతలు ..మరో పక్క కరెంబు బిల్లుల బాదుడుతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. కరెంటు లేక ఉక్క పోత..కరెంటు ఉంటే బిల్లులతో లెక్క పోత…వెరసి సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు జగన్ అని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరిలోని పలు గ్రామాల్లో పర్యటించిన లోకేష్…ఆంధ్రప్రదేశ్ ని జగన్ అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేసారని నిప్పులు చెరిగారు.
బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనం సాధకబాధకాలను తెలుసుకునేందుకు పలు గ్రామాల్లో లోకేష్ పర్యటించారు. అయితే, లోకేష్ పర్యటిస్తున్న సమయంలోనే కరెంట్ పోవడంతో లాంతర్ చేతబట్టుకొని మరీ లోకేష్ పర్యటన కొనసాగించారు. లాంతరు వెలుతురుతో పాటు టీడీపీ కార్యకర్తలు చేతిలో పట్టుకున్న క్యాండిల్స్ తో గ్రామంలో లోకేష్ పర్యటించారు. దీంతో, జగన్ చీకట్లలో లోకేష్ వెలుగులు చిమ్మించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలోనే ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విసనకర్రలను లోకేష్ పంపిణీ చేశారు. లోకేష్ కు తమ బాధలు చెప్పుకొని ప్రజలు వాపోయారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ లోకేష్ గ్రామమంతా కలియదిరిగారు. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఇంటికి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో పాటు విసనకర్రలను కూడా అందజేస్తున్నారు.