వైసీపీ ఓటమికి ఈవీఎంలు కారణమా? పార్టీ అధినేత, ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్ కారణమా? అంటే.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కూడా.. ఏమీ తడుముకోవడం లేదు. రెండేదో సమాధానంగా చెబుతున్నా రు. కాకపోతే.. నేరుగా ఎవరూ పేరును బయట పెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయట పడు తున్నారు. తప్పులు ఒప్పుకొంటున్నారు. అధినేతపై ఉన్న అభిమానమో.. లేక అధినేతను నేరుగా అంటే బాగుండదని అనుకుంటున్నారో.. మొత్తానికి ఆచి తూచి వైసీపీ ఓటమికి కారణాలు చెబుతున్నారు.
కూల్చాం కాబట్టే: శనివారం.. రాష్ట్రంలో అలజడి రేపిన వ్యవహారం.. జగన్ ఇంటి పక్కన.. తాడేపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేయడం. దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇదే విషయంపై స్పందించిన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం నిజం చెప్పారు. “మేం అధికారంలో ఉండి కూల్చాం కాబట్టే.. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే.. అసెంబ్లీలోనే ప్రమాణ స్వీకారం చేసి ఉండేవాళ్లం కదా!“ అన్నారు. అంటే.. కూల్చివేతల కారణంగానే తాము ఓడామని ఆయన ఒప్పుకొన్నారు.
వేధించాం కాబట్టే: తాజాగా ఆదివారం మీడియాతో మాట్లాడిన.. గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా.. తప్పు ఎక్కడ జరిగిందో పూస గుచ్చినట్టు వివరించారు. చంద్రబాబును వేధించి.. విమర్శించి.. హేళన చేసి.. జైలుకు పంపించామని.. అదే ఆయనలో కసి పెంచి.. గెలిచేలా చేసిందన్నారు. అంటే.. అవే తప్పులు తమకు శాపంగా మారాయని ఆయన కూడా ఒప్పేసుకున్నారు. ఇదేసయమంలో మద్యం, ఇసుక వంటి వాటిని కూడా.. కాసు ప్రస్తావించారు. అంటే.. మొత్తానికి జగన్ అనుసరించిన విధానాలే కొంపముంచాయని యువ నాయకులు తేల్చారు.
మరి వీరి కన్నా సీనియర్, మాజీ ముఖ్యమంత్రి, పార్టీకి అధినేతగా ఉన్న జగన్ మాత్రం ఇంకా తప్పులు వెతుక్కునే పనిలోనే ఉండడం గమనార్హం. ఇంకా ఆయన ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని.. ఆధారాలు లేవని లేక పోతే.. ఏకేసేవారమని చెబుతున్నారు. జూనియర్లకు ఉన్న విజ్ఞానం.. ఆలోచన కూడా.. సీనియర్‌గా జగన్‌కు లేకపోవడం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఆయనకు తెలిసి.. దాస్తున్నారా? లేక..తప్పులు ఒప్పుకొంటే.. ఏదైనా ప్రమాదమా? అనేది ప్రశ్న.