టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య గ్యాప్ వచ్చిందని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ లాగా మారిన అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. గతంలో సినిమా రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడల్లా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పేరు ప్రస్తావించనిదే బన్నీ తన ప్రసంగాన్ని ముగించేవాడు కాదు.
అయితే, కొంతకాలంగా మెగాస్టార్ పేరు ఎత్తకుండా తన తండ్రి అల్లు అరవింద్ తన హీరో అన్నట్టుగా బన్నీ మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇక, పవన్ కళ్యాణ్ పేరు చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్లు కొద్ది సంవత్సరాల క్రితం దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న పుకార్లపై అల్లు అరవింద్ స్పందించారు. సొసైటీలో, సినీ రంగంలో ఇలా అనుకోవడం సహజమని, కానీ, తాను చిరంజీవి…బావా బామ్మర్దులలా కాకుండా మంచి స్నేహితులుగా పైకి వచ్చామని అల్లు అరవింద్ చెప్పారు.
తమ పిల్లలు కూడా ఇదే రంగంలో ఉన్నారని, ఉన్న అవకాశాలని వాళ్లంతా పంచుకోవాలని అన్నారు. అల్లు, మెగా ఫ్యామిలీలకు చెందిన పిల్లలు పోటీ తత్వంతో ఎవరి స్థానానికి వారు ఎగబాకుతున్నారని, ఈ క్రమంలో ఇలాంటి పుకార్లు చాలా కామన్ అని అన్నారు. అల్లు శతజయంతి వేడుకలలో తమ కుటుంబ సభ్యులు అంతా పాల్గొనడం, చిరంజీవి సరదాగా ఉండటం వంటివి ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయిందని చెప్పారు. ఇప్పటికీ తామంతా సంక్రాంతి, దీపావళి పండుగలను చిరంజీవి ఇంట్లోనే జరుపుకుంటామని, అయితే ఈ విషయాలు బయటకు తెలియవని అన్నారు.