ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ సీఐడీ గతంలో పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ తదుపరి విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబరు 1కి వాయిదా వేసింది. నవంబరు 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ కేసులో టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులు అటాచ్ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
మరోవైపు, స్కిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారు రాజేశ్ తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసుల్లో రాజేశ్ ను నిందితుడిగా పేర్కొన్నారని ఆయన తరఫు లాయర్లు వాదించారు. అయితే, తాము రాజేశ్ ను నిందితుడిగా పేర్కొనలేదని, ఎల్ఓసీ పొరపాటున ఇచ్చామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.