విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ముందు నుంచి తన నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ టీడీపీ నేతలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక, తాజాగా పార్లమెంటు సాక్షిగా విశాఖ ఉక్కుపై తెలుగు దేశం పార్టీ యువ ఎంపీ, కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం వైరల్ అయింది. విశాఖ ఉక్కు నష్టాల్లో లేదని, కేంద్రం విశాఖ ఉక్కుపై సవతి ప్రేమ చూపుతోందని నిండుసభలో మోడీని కడిగిపారేశారు.
ఆ ప్రసంగానికిగాను రామ్మోహన్ నాయుడుపై పార్టీలకతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు…. ప్రధానికి రెండు లేఖలు కూడా రాశారు. అయితే, విశాఖ ఉక్కుపై చంద్రబాబు స్పందించలేదని, మాట్లాడలేదని కొందరు వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా, వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా కేంద్రం సమాధానమిచ్చింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త రాసిన లేఖకు పీఎంఓ నుంచి సమాధానం వచ్చింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ చంద్రబాబు 2 లేఖలు రాశారని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 20న, మార్చి10న ప్రధానికి చంద్రబాబు నాయుడు 2 లేఖలు రాశారని, అవి పీఎంఓకు చేరాయని వెల్లడించింది. ఆ లేఖలకు సమాధానం ఇచ్చామని, గడువులోగా పూర్తి స్థాయిలో జవాబును పంపాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ విభాగానికి సూచించామని పేర్కొంది. కేంద్రం తాజా జవాబుతో వైసీపీ నేతల విష ప్రచారానికి తెరపడింది. విశాఖ ఉక్కును ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు.