ఏపీలో రోడ్ షోలు, రహదారులపై సభలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి తానే కారణమని కేఏ పాల్ క్లెయిం చేసుకున్నారు. ఈ మేరకు రోడ్లను ర్యాలీలకు ఉపయోగించుకోవడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 జారీకి కారణం తానేననన్నారు పాల్. తన విజ్ఞప్తి మేరకే సీఎం జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. జీవో నంబర్ 1 విడుదల చేసినందుకు ఆయన జగన్కు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడతూ ఏపీలో చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో 8 మందిని, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు సభల్లో జనం చనిపోవడంతో ర్యాలీలను నిషేధించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిసెంబర్ 30న తాను కోరానని పాల్ చెప్పారు.
తన విజ్ఞప్తి మేరకు జీవో విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.
మరోవైపు జీవో నంబర్ 1 విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ నేతలు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు, టీడీపీ నేతలు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై మండిపడ్డారు.
అయితే, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని ఆయన అన్నారు. జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని, విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహించొద్దని చెప్పలేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్లలో నిర్వహించుకోవచ్చు అని జీవోలో పేర్కొన్నారని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్లు ఉన్నది ప్రయాణాల కోసమే కానీ.. బహిరంగ సమావేశాల కోసం కాదు అన్నారు.