తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీకి పట్టుకొమ్మ అయిన.. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ప్రజల నాడి మారిందని… ఇక్కడి ప్రజలు ఇప్పుడు జేసీ వర్గాన్ని కోరుకుంటున్నార ని.. తాజాగా సంకేతాలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ ఒక నినాదం అందుకున్నారు. `రావాలి జగన్.. కావాలి.. జగన్!` అనే నినాదాన్ని జోరుగా వినిపించారు. ఇది ఎన్నికల్లో బాగా వర్కవుట్ అయింది. ఇక, ఇప్పుడు ఇదే నినాదం.. మరో రూపంలో వినిపిస్తోందనని అనంతపురం ప్రజలు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజా నాడి మారిందని అంటున్నారు. ‘రావాలి ప్రభాకర్.. కావాలి ప్రభాకర్’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పేరు తో నినదిస్తున్నారని.. పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో జేసీ సోదరులు ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అనేక కేసులు.. జైళ్లు.. ఇలా వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో జనాల్లో వారిపై సింపతీ పెరిగిందనేది వాస్తవం.
ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు రావాలి ప్రభాకర్.. కావాలి ప్రభాకర్ నినాదం అందుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జేసీ వర్గం జోరు ఎక్కువగా ఉంది. ప్రతి వార్డులోనూ జేసీ వర్గానికే టీడీపీ అధినేత బీ ఫారం అందించారు.. ఇక, జేసీ కుటుంబం కూడా యాక్టివ్గా తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు కూడా జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికంగా ప్రజానాడి ఎలా ఉందనే విషయంపై జేసీ వర్గం.. పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో నే రావాలి ప్రభాకర్.. అనే నినాదం వినిపిస్తున్నారని ఈ వర్గం చెబుతుండడం గమనార్హం. మరి ఏమేరకు ఇది వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలంటే.. ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.