ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తున్న హైకోర్టు.. తాజాగా కూడా నిప్పులు చెరిగింది. గడిచిన నాలుగేళ్లలో అనేక సందర్భాల్లో ప్రభుత్వంపై హైకోర్టు సూటి విమర్శలు చేయడంతోపాటు ధిక్కరణ పిటిషన్లు ఎక్కువైపోతున్నాయని.. దీనిని బట్టి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తోందో అర్ధం చేసుకుంటున్నామని కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.
ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి అనేక మంది అధికారులను కోర్టుబోనులో సైతం నిలబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకులు, డీజీపీలు కూడా.. కోర్టు మెట్లు ఎక్కినవారే కావడం గమనార్హం. ఇక, తాజాగా ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు కడిగేసింది.
ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. తాను అమెరికా వెళ్లాల్సి ఉందని.. కుటుంబ కార్యక్రమాల కోసం.. వెళ్లక తప్పదని డీజీపీ రాజేంధ్రనాథ్రెడ్డికి విన్నవించారు. అయితే.. ఆయన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. గత మూడు మాసాలుగా తొక్కిపెట్టారు. దీంతో ఈ విషయంపై ఏబీవీ.. హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికి రెండు సార్లు దీనిని విచారించిన కోర్టు.. విదేశీ ప్రయాణాన్ని.. ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు పేర్కొందని.. ఎంతో బలమైన నేరం ఉంటే తప్ప.. ఆ హక్కును హరించే అధికారం లేదని గత ఆదేశాల్లో తేల్చి చెప్పింది.
తాజాగా మళ్లీ గురువారం దీనిపై విచారణ జరిగింది. అయితే.. ప్రభుత్వం మాత్రం యథాలాపంగా పాత వాదననే వినిపించింది. ఆయనను సస్పెండ్ చేశామని .. కేసులు ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “స్కూల్లో మీరు ప్రాథమిక హక్కులు చదువుకున్నారా? వాటి విలువ.. అవసరం తెలుసా? అన్నీ తెలిసే ఇలా చేస్తున్నారా? “ అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏబీవీ విదేశీ ప్రయాణానికి మార్గం సుగమం చేస్తున్నట్టు పేర్కొంది. అయితే.. ప్రభుత్వానికి ఏబీవీ కూడా సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిర్దేశిత సమయంలోగా తిరిగి రావాలని.. వాయిదా వేయొద్దని పేర్కొంది.