ఆదిపురుష్ సినిమా తొలి రోజు.. తొలి వీకెండ్ ఊపు చూసి దాని మీద నెగెటివ్ టాక్ పెద్దగా ప్రభావం చూపట్లేదనే అనుకున్నారంతా. కానీ వీకెండ్ అయ్యాక ‘ఆదిపురుష్’ది బలం కాదు వాపు అని తేలిపోయింది. సోమవారం నుంచి వసూళ్లు ఒక్కసారిగా పెద్ద ఎత్తున డ్రాప్ అయిపోయాయి.
చెప్పుకోవడానికి పెద్దగా షేర్ లేకుండా వీక్ డేస్ గడిచిపోయాయి. ఈ సినిమా రెండో వీకెండ్లో అడుగు పెట్టే సమయానికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ కూడా రిలీజ్ కాలేదు. అయినా సరే వీకెండ్‌ను ఆశించినంత స్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది. చిత్ర బృందం కొంచెం పబ్లిసిటీ అది చేసి.. ఏవైనా ఆఫర్లు లాంటివి పెట్టి ఉంటే రెండో వీకెండ్లో వసూళ్లు మెరుగ్గా ఉండేవేమో. కానీ అలాంటిదేమీ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.
కానీ సినిమా దాదాపుగా పడుకున్నాక.. ఇప్పుడు జనాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ‘ఆదిపురుష్’ రన్ దాదాపుగా ముగిసిపోతున్న దశలో టికెట్ ధరలను తగ్గిస్తోంది టీం.
ఉత్తరాది రాష్ట్రాల్లో, అలాగే కర్ణాటకలో ఈ సినిమా త్రీడీ వెర్షన్ టికెట్ ధరలను రూ.150కి, రెగ్యులర్ వెర్షన్ల ధరలను రూ.112కు తగ్గించింది చిత్ర బృందం. కానీ జనాలకు ఈ సినిమా చూసే ఆసక్తే పెద్దగా లేనపుడు టికెట్ల ధరలను తగ్గించి ప్రయోజనం ఏముందన్నది ప్రశ్న. ఈ పని తొలి వీకెండ్ అయ్యాక చేసి ఉంటే.. కచ్చితంగా మేలు జరిగేది.
ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవాళ్లు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ గురించి చర్చే ఆగిపోయింది. సినిమా పోయింది కాబట్టి టికెట్ ధరలను తగ్గించారనే ఫీలింగ్ జనాలకు వస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో చూసుకుందాం అనే ఫీలింగ్‌లో జనాలు ఉన్నారిప్పుడు. అలాంటపుడు రేట్లు తగ్గాయని థియేటర్లకు వెళ్తారా అన్నది సందేహమే. పైగా ‘ఆదిపురుష్’కు ఎక్కువ మార్కెట్ ఉన్న.. సినిమాలు బాగా చూసే తెలుగు రాష్ట్రాల్లో రేట్లు తగ్గించకపోవడం సరైన స్ట్రాటజీ అనిపించుకోదు.