సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ స్పందించారని, చంద్రబాబును ఎత్తేశారంటూ జగన్ ఉపయోగించిన భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామ దుయ్యబట్టారు. చంద్రబాబును అరెస్టు చేసేటప్పుడు తాను లండన్ లో ఉన్నానంటూ నవ్వుతూ జగన్ చెబుతున్నారని ఆరోపించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి గురించి జగన్ వాడిన భాష బజారు భాషలా ఉందని దుయ్యబట్టారు. జగన్ పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారని, ఇంకా బెయిల్ రాకపోవడం తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని బాధపడ్డారు.
డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని పార్సిల్ చేసిన అనంతబాబుకు బెయిల్ వచ్చిందని, పార్టీ కార్యక్రమాల్లో ఆయన దర్జాగా పాల్గొంటున్నాడని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి కూడా బెయిల్ దొరికిందని, కానీ, చంద్రబాబు వంటి నేతకు బెయిల్ రాకపోడం దురదృష్టకరమని చెప్పారు.