టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిం చాలని నిర్ణయించుకోవడం.. ఆ వెంటనే ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో కార్యక్రమం నిర్వహిం చడం తెలిసిందే. అయితే. తొలి రెండు రోజులు బాగానే సాగిన చంద్రబాబు యాత్ర, కార్యక్రమం.. మూడో రోజుకు వచ్చే సరికి మాత్రం నిర్బంధాలు.. ఆంక్షల కౌగిలిలోకి వెళ్లిపోయింది.
సామర్లకోట నుంచి అనపర్తి వెళ్తున్న చంద్రబాబును.. బలభద్రపురం దాటిన తర్వాత తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా పోలీసులు.. లారీలు, పోలీసు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిపేశారు. అంతేకాకుండా చంద్రబాబు వాహనశ్రేణికి అడ్డంగా రోడ్డుపై కానిస్టేబుళ్లను కూర్చోబెట్టారు. దీంతో చంద్రబాబు బలభద్ర పురం నుంచి 5 కిలోమీటర్ల మేర కాలినడకన అనపర్తికి బయలుదేరారు.
కాలినడకన బయల్దేరిన చంద్రబాబు.. గంట 15 నిమిషాల్లో 8 కిలోమీటర్లకు పైగా నడిచారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు మార్గమధ్యలో బస్సుల్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారు. టీడీపీ శ్రేణులు చంద్రబా బు వెంట నడుస్తూ.. అడ్డుగా ఉన్న బస్సుల్ని పక్కకు తోసి.. పోలీసుల్ని తోసుకుంటూ చంద్రబాబును ముందుకు నడిపించారు. దీంతో పలువురిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
చంద్రబాబు భద్రత ఏమైనట్టు?
టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు పాదయాత్రకు పోలీసులు ఎక్కడా లైట్లు ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే నడిచారు.
కారణం ఏంటి?
ప్రభుత్వం గత జనవరి నెలలో జీవో 1 తీసుకువచ్చింది. దీని ప్రకారం.. బహిరంగ సభలు, రోడ్ షోలపై కొన్ని నియంత్రణలు విధించింది. అయితే.. దీనిని రాష్ట్ర హైకోర్టు కొన్ని రోజులు సస్పెండ్ చేసినా. తర్వా త.. దీనిపై ఇంకా పూర్తి తీర్పు వెలువరించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షోలో మాట్లాడవద్దని.. బహిరంగ సభలు వద్దని.. ఎక్కడైనా ప్రత్యేక ప్రాంతం ఎంచుకుంటే.. అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ పరిణామమే వివాదానికి దారితీసింది.