కాంగ్రెస్ లో శివాలెత్తిపోతున్న సీనియర్లు

రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని కలలుగంటున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తమకు టిక్కట్లు దక్కవేమోనన్న భయంతో శివాలెత్తిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత మొత్తం 65 మందితో కాంగ్రెస్‌ హై కమాండ్‌ మొదటి జాబితా విడుదల చేసిన విషయం విదితమే. తరువాత 10 మందితో రెండో జాబితాను కూడా విడుదల చేసింది. అయితే మొదటి జాబితా తరువాత చోటుచేసుకున్న నిరసనలు, రెండో జాబితా ప్రకటన తరువాత కూడా కొనసాగుతున్నాయి. మొదటి జాబితాలో పేరు లేని ఆశావహులంతా రెండో జాబితా కోసం వేచి చూశారు. దానిలోనూ తమ పేర్లు లేకపోవడంతో టికెట్‌పై ఆశ పెట్టుకున్న నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో కష్టపడిన వారికి టికెట్‌ దక్కలేదని వారంతా ఆందోళనకు దిగుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తమ నాయకునికి టికెట్‌ ఇవ్వకుండా మరో నేతకు ఇచ్చారని పలుచోట్ల పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని సమాచారం.

కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులైన పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల , మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి ల పేర్లు రెండో జాబితాలోనూ కనిపించలేదు. పొన్నాల లక్ష్మయ్యకు టిక్కట్ దక్కకపోవడంతో జనగామ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారని తెలుస్తోంది. వారంతా జనగామలో ఆందోళనకు దిగారని భోగట్టా. ఈ నేపధ్యంలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. మరోవైపు ఖైరతాబాద్‌ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు ఇవ్వడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరాలు లేవదీస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు దానం రాజీనామా చేసిన అనంతరం ఖైరతాబాద్‌ సెగ్మెంట్ వ్యవహారాలను రోహిణ్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు అతనిని కాదని దాసోజ్‌ శ్రవణ్‌కు ఇవ్వడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. పైగా ముషీరాబాద్‌లో నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్న శ్రవణ్‌కు ఖైరతాబాద్‌ టిక్కట్ ఎలా కేటాయిస్తారని రోహిణ్‌ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా ఖైరతాబాద్‌ టికెట్‌ ను కాంగ్రెస్‌కు కేటాయించడంపై టీడీపీ నేతలు అసంతృప్తితో వేగిపోతున్నారని సమాచారం. వారు ఖైరతాబాద్ టికెట్‌ను టీడీపీకి కేటాయించాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇదిలావుండగా రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేస్తే గొల్ల కురుమలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తారని బెదిరింపులకు దిగారు. మరో వైపు ఇప్పటివరకూ ప్రకటించిన 75 స్థానాల్లో బీసీలకు కేవలం 15 టికెట్లు మాత్రమే కేటాయించడంపై బీసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మరి ఇంతలా పెరుగుతున్న అసంతృప్తులను కాంగ్రెస్ అధిష్ఠానం ఏవిధంగా చల్లారుస్తుందో వేచిచేడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.