అమరావతి టు అరసవిల్లి పేరుతో రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో అవాంతరాలు వచ్చినా రైతులు ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. వైసిపి నేతలు ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించాలని చూసినా రైతులు మొక్కవోని దీక్షతో వర్షాలు, వరదలను కూడా లెక్కచేయకుండా తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతుల యాత్రకు సంఘీభావం తెలిపేందుకు పలువురు టిడిపి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
మండుటెండను, జోరు వానను కూడా లెక్కచేయకుండా రైతులకు మద్దతుగా వారి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడం సంచలనం రేపుతోంది. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న రైతుల పాదయాత్రకు రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపి వారితో కలిసి నడిచారు. అయితే, గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పాదయాత్రలో పాల్గొనాలన్న సంకల్పంతో రామకృష్ణారెడ్డి తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ముందుకు సాగారు.
ఈ క్రమంలోనే నేడు ఎండ వేడిని తాళలేక రామకృష్ణారెడ్డి పాదయాత్ర చేస్తూనే హఠాత్తుగా కింద పడిపోయారు. దీంతో ఆయనను రైతులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ రామకృష్ణారెడ్డి తమకు మద్దతు తెలిపేందుకు వచ్చి ఇలా హఠాత్తుగా సొమ్మసిల్లిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వచ్చారని, ఈ క్రమంలో ఇలా జరగడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అమరావతి రాజధాని కోసం దూరాన్ని కూడా లెక్కచేయకుండా మండుటెండలో నడిచి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు, అమరావతి రైతులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.