ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పొద్దున పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఈ రకంగా మండే ఎండాకాలంలో మలమల మాడుతున్న హైదరాబాద్ జనం కొందరు కనికరించమంటూ సూర్యభగవానుడిని వేడుకుంటున్నారు. మరికొందరేమో ఇవేం ఎండలు బాబోయ్ అంటూ సూర్యుడిని ఆడిపోసుకుంటున్నారు. అలాంటి వారిపై అలిగిన సూర్యుడు వారికి దిమ్మదిరిగే షాకిచ్చాడు.
గ్లోబల్ వార్మింగ్ కు గ్లోబలైజ్ చేసిన జనం…ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నాయంటూ నన్నే నిందిస్తారా అని అలకబూనాడు. అందుకే, హైదరాబాద్ లో నీడను సూర్యుడు 2 నిమిషాలపాటు మాయం చేసి జనానికి ఝలక్ ఇచ్చాడు. కరెక్టుగా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో హైదరాబాద్ లో నీడ మాయమైంది.
12:12 గంటల నుంచి 12:14 వరకు కాంక్రీట్ జంగిల్ లోని బిల్డింగ్ లు మొదలు వాటిని కట్టిన జనం వరకు అందరి నీడ కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
బాబ్బాబు…ఇంకెప్పుడూ ఎండలెక్కువగా ఉండడానికి కారణం నువ్వేనని నిన్ను నిందించం అంటూ చివరకు కాళ్లా వేళ్లా పడి జనం బ్రతిమిలాడడంతో సూర్య భగవానుడు కరుణించాడు….మాయమైన నీడను తిరిగి ప్రత్యక్షమయ్యేలా చేశాడు. బుద్ధి తెచ్చుకొని గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు అందరూ కృషి చేయండి…చెట్లు పెంచండి…లేదంటే ఈ సారి నీడ శాశ్వతంగా మాయం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లాడు.
అయితే, ఇలా నీడ మాయమవడాని సూర్యుడు కోపమో..శాపమో కారణం కాదని ఖగోళ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ‘జీరో షాడో’ వల్లే అలా జరిగిందని, ఆ సమయంలో ఎండలో నిటారుగా (90 డిగ్రీల కోణంలో) ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు కనిపించదని క్లారిటీనిచ్చారు. బిర్లా టెంపుల్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఖగోళ శాస్త్రవేత్తలు జీరో షాడో డే సందర్భంగా ఈ ఖగోళ అద్భుతంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వస్తువులు, కట్టడాలు, మనుషులపై నిట్టనిలువుగా సూర్య కిరణాలు పడటంతో నీడ మాయమవుతుందని వివరించారు.
ప్రతి ఏటా రెండుసార్లు ఇలా నీడ మాయమవుతుందని, హైదరాబాద్లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులోనూ ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 నుంచి 12.19 వరకు 2 నిమిషాల పాటు జీరో షాడో ఏర్పడిన సంగతి తెలిసిందే.