వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంతనాలు జరుపుతున్నారని కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, తెలంగాణలో పోటీ చేస్తానని, తెలంగాణ రాజకీయాలకు పరిమితం అవుతానని షర్మిల చెబుతున్నారని, ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోందని టాక్ వచ్చింది. దీంతో, ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో పాటు ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం అయ్యానని, తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని షర్మిల వెల్లడించారు. తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను ఎప్పుడు కష్టపడి పనిచేస్తూనే ఉంటానని షర్మిల అన్నారు. ఇక, కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అందరితో చెబుతున్నానంటూ మీడియా ముందు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన మిగతా ప్రశ్నలకు షర్మిల సమాధానం దాటవేశారు.
ఈ రోజే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళుతున్నానని, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక లాంఛనమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తారా ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక, షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లోనే ఈ విషయాలపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ ప్రజల కోసం కష్టపడతా అని షర్మిల చెప్పడంతో ఆమె తెలంగాణ నుంచే పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.