వడ్డించేవాడు మనోడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు…అనేది ఒక నానుడి. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా చెల్లుబాటవుతుంది అన్న ధోరణి ఇటు రాజకీయ నాయకుల్లోనూ అటు ప్రజలలోను బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన ఇప్పటంలోని రోడ్ల విస్తరణ పనులు నేపథ్యంలో కొన్ని విగ్రహాలు తొలగించి వైయస్ విగ్రహం మాత్రం తొలగించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ పర్యటన నేపథ్యంలో ఆ విగ్రహానికి భారీ బందోబస్తు చేయడం కూడా చర్చనీయాంశమైంది.
120 అడుగుల రోడ్లు వేస్తామంటూ రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయని చెబుతూ జనసేనకు మద్దతిచ్చిన వారి ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం వంటి నేతలు విగ్రహాలను కూడా రోడ్డు పనులకు అడ్డుగా ఉన్నాయని అధికారులు తొలగించారు. కానీ, ఆ విగ్రహాల పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రం అధికారులు టచ్ చేయలేదు.
ఇక, మొన్న ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కూడా వైయస్ విగ్రహానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ రెండంచెల ముళ్లకంచెను ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో పోలీసులను పహారాకు పెట్టారు. దీంతో, పవన్ కు భద్రతగా ఉండాల్సిన పోలీసులు వైఎస్ విగ్రహానికి కాపలా కాశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా అధికారులు తొలగించారు.
ఏది ఏమైనా పవన్ ఇప్పటం పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని, సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందని టాక్ వస్తోంది. జగన్ మెడను పవన్ వంచారని, అందుకే ఆ విగ్రహం తొలగించారని సోషల్ మీడియాలో జనసేన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.