తెలంగాణకు వ్యతిరేకి వైఎస్ అన్న మాటను.. ఆయన్ను అమితంగా అభిమానించే తెలంగాణ ప్రాంతీయులు సైతం మౌనంగా ఉంటారే తప్పించి.. అంత మాట ఎలా అంటావ్? అన్న మాట అనటానికి మాత్రం ఇష్టపడరు. నిజంగానే వైఎస్ తెలంగాణకు వ్యతిరేకమా? అదే నిజమైతే.. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని మేనిఫేస్టోలో ఎందుకు పెట్టిస్తారు?
1999లోనే వైఎస్ సంతకాలు పెట్టి ఎందుకు పంపుతారు? అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీనే ఏర్పాటు కాలేదు కదా? అలాంటప్పుడు వైఎస్ తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్రను ఎలా వేస్తారు? లాంటి ప్రశ్నల పరంపరను సంధిస్తే.. నిజమే కదా? ఇంతకాలం ఆ సోయి ఏమైపోయిందన్న సందేహం కలుగక మానదు.
తాను నమ్మిన విషయాల్ని.. నిజాలన్నట్లుగా చెప్పే నేర్పు రాజకీయ నేతలకు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందని చెప్పాలి. ఆ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆయన ప్రయత్నం.. అదే సమయంలో కాలం కలిసి రావటం.. వెరసి ఆయనిప్పుడు తిరుగులేని అధినేతగా మారారు.
ఆయన్ను రాజకీయంగా ఢీ కొట్టాలన్న ఆలోచనకు సైతం ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఉంది. అలాంటి వేళ.. జరిగింది ఇది.. కేసీఆర్ ఇలా మాటలతో మాయ చేశారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో బిజీ అయ్యారు వైఎస్ షర్మిల.
తాజాగా ఆమె ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణకు వైఎస్ వ్యతిరేకి అన్న వాదనను పటాపంచలు చేసేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించిన భావజాలం.. భావోద్వేగాలు కొన్ని ఉన్నాయని.. వాటిని కేసీఆర్ గరిష్ఠంగా వాడుకున్నారని.. అవసరం వచ్చినప్పుడు మళ్లీ రెచ్చగొడుతూ ఉంటారని.. అలాంటిది తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్ కుమార్తె షర్మిలకు ఇక్కడ రాజకీయం చేసే అర్హత లేదన్న వాదనను ఎలా ఎదుర్కోనున్నారు? అన్న ప్రశ్నకు స్పందించారు షర్మిల.
‘మీలాంటి పెద్దలు వైఎస్ తెలంగాణ వ్యతిరేకి అంటున్నారంటే.. కేసీఆర్ ఎంత బలంగా వైఎస్ ను తెలంగాణ వ్యతిరేకి అన్న బ్రాండింగ్ చేశారో అర్థం చేసుకోవాలన్నారు షర్మిల. వైఎస్సార్ మీద కేసీఆర్ వేసిన ముద్ర మాత్రమే అన్నారు.
అసలు తెలంగాణకు వైఎస్ వ్యతిరేకి ఎందుకు అవుతారు? అని ప్రశ్నిస్తూ.. ‘‘1999లోనే తెలంగాణకు అనుకూలంగా వైఎస్సార్ సంతకాలు పెట్టి పంపారు. అప్పటికి టీఆర్ఎస్ ఇంకా పుట్టలేదు. తెలంగాణ అవసరం ఉందని 2004, 2009 మేనిఫెస్టోలో పెట్టారు. 2004లో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నప్పుడు వైఎస్సార్ దేవుడు.. 2009లో పొత్తు లేనప్పుడు తెలంగాణకు వ్యతిరేకి.
అదే తరహాలో చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటేనేమో ఆయన దేవుడు. తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆంధ్రా పార్టీనా? కేసీఆర్ అవసరం వచ్చినప్పుడు నాలుక ఎటు పడితే అటు తిప్పుతుంటారు. వైఎస్సార్ ఎప్పుడూ ఈ ప్రాంతం… ఆ ప్రాంతం అని చూడలేదు. ఎక్కువ బోర్లు తెలంగాణలో ఉన్నాయని తెలిసే ఉచిత విద్యుత్తు ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ఇచ్చారు. నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన తెలంగాణ ప్రజల్లో తీసెయ్యడానికి వైఎస్సార్ చాలా ప్రయత్నించారు’’ అని పేర్కొన్నారు.
వైఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తన పనిని సులువు చేస్తాయని.. తాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని.. తనను చూడగానే తన తండ్రి గుర్తుకు వస్తారని.. తన తండ్రిని చూస్తే ఆయన సంక్షేమం గుర్తొస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటారన్న నమ్మకం ఉందన్నారు షర్మిల. అదెంత వరకు నిజమవుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.