వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి తాజాగా మూడో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే విచారణ సమయంలో అవినాష్ రెడ్డి లాయర్ ను సీబీఐ అధికారులు అనుమతించలేదు. దీంతో, తాజాగా ఈ వ్యవహారంపై అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కూడా అవినాష్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని తనకు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి వివేకా కుమార్తె సునీత తాజాగా షాకిచ్చారు. అవినాష్ రెడ్డి పిటిషన్లో తనను ఇంప్లీడ్ చేయాలని సునీత కోరబోతున్నారని తెలుస్తోంది. పిటిషన్లో అవినాష్ రెడ్డి తన వ్యక్తిగత అంశాలు పేర్కొనడంపై తన వాదనలను వినాలని సునీత కోర్టును అభ్యర్ధించనున్నారని తెలుస్తోంది.
అంతకుముందు, వివేకా కుటుంబంపై, సునీతపై అవినాష్ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. వివేకా కుటుంబంలో చాలా వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ప్రమాదం ఉందని చెప్పారు. తన వాంగ్మూలం ఆడియో, వీడియోలను రికార్డు చేయాలని చెప్పినా సీబీఐ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. సీబీఐ తనపై రెండు అభియోగపత్రాలు దాఖలు చేసిందని, తాను నేరం చేసినట్లు అందులో ఎలాంటి ఆధారాలు చూపలేదని అవినాష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.