ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంచాయతీ పీక్స్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. షర్మిలది ఆస్తి గొడవ కాదని, అధికారం కోసం గొడవ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మీడియా సమావేశాలు పెడుతుందని, జగన్ కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని విజయసాయి ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే విజయసాయి వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. సాయిరెడ్డి మాట్లాడిందంతా జగన్ ఇచ్చిన స్క్రిప్టని, అలా కాదు అని ఆయన ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు వాటా అని నాడు వైఎస్సార్ తీర్మానించారని, ఆ నిర్ణయం అబద్ధమని తన బిడ్డలపై విజయసాయి ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తి విజయసాయి అని, రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడ్డారని ఆరోపించారు. జగన్ కోసం తనపై విజయసాయి ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదన్నారు.
“కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి జగన్ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ ముఖ్యమంత్రిగా కాగానే పొన్నవోలుకు ఏజీ పదవి ఎందుకు ఇచ్చారు? సొంత ప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్” అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను 2 సార్లు అధికారంలోకి తెచ్చిన బంగారు బాతు వైఎస్ ఆర్ ను ఎవరూ చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని చెప్పారు.