‘వైఎస్సార్ టీపీ’ పార్టీ ఆవిష్కరణ సభలో ప్రసంగించిన వైఎస్ షర్మిల…తమ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తమ ఎజెండా ఏంటో కూడా వెల్లడించారు. సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం సాధనే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. తన తండ్రి వైఎస్సార్ మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ అని షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ అడుగుజాడల్లో నడిచేందుకే ఆయన జయంతి రోజున వైఎస్ఆర్టీపీని స్థాపించామన్నారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్.. పావలా వడ్డీ, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ వంటి అనేక పథకాలకు వైఎస్ రోల్ మోడల్ అని అన్నారు. కోటి ఎకరాలకు నీరందించే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు వైఎస్ అన్నారు. వైఎస్ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్ టీపీ లక్ష్యమని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు గుప్పించారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని, రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్ షాపుల ముందు జనం క్యూ లైన్లలో నిలబడుతున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడే కేసీఆర్ ఫామ్‌హౌస్ చక్కబెట్టుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్ ఫ్యామిలీనేనని సెటైర్లు వేశారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని, దీంతో, కరోనాకు ఎంతో మంది బలైపోయి ఆస్తులమ్ముకున్నారని విమర్శించారు. వారికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని షర్మిల నిలదీశారు. తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్ పాపం పోతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు.. చేతికి చిప్పలు అని షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.