ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సభకు హాజరుకాని జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి ఎమ్మెల్యే పదవి ఎందుకని షర్మిల సూటిగా మరోసారి ప్రశ్నించారు.
తనతోపాటు వైఎస్ సునీతపై అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టించింది అవినాష్ రెడ్డి అని రవీందర్ రెడ్డి చెప్పారని షర్మిల షాకింగ్ ఆరోపణలు చేశారు. అటువంటి అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డి కారణమని రవీందర్ రెడ్డి చెప్పారని, భార్గవ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిల ప్రశ్నించారు.
కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని షర్మిల నిలదీశారు. ఇటువంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని షర్మిల అన్నారు. చేయాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ….అన్న రీతిలో కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని సెటైర్లు వేశారు. మీడియా ముందు టెంకాయ కొట్టి షర్మిల వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు కొట్టారని, పార్లమెంటులో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.