ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారన్న గాసిప్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. ఈ వార్త ఒక సంచలనం అయితే… దానిని ఖండిస్తూ వైఎస్ కుటుంబం నుంచి ఏ ప్రకటనా రాకపోవడం మరో సంచలనం.
పలువురు ఈ వ్యవహారాలపై స్పందించడం మొదలుపెట్టారు. ఇక టీడీపీ నేతలు ఎలాగూ దీని ఆధారంగా జగన్ చీటింగ్ మనస్తత్వాన్ని ఎండగట్టిన విషయం పక్కన పెడితే… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్ ఒంటరిగా వైయస్ఆర్ వారసుడిగా ఉండాలని ఆలోచిస్తున్నారని అన్నారు. షర్మిలా కూడా వైయస్ఆర్ వారసురాలు కాబట్టి, ఆమె తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించడంలో తప్పు ఏం లేదన్నారు.
“జగన్ ఆమెకు వైజాగ్ టికెట్ నిరాకరించడం ద్వారా షర్మిలాకు అన్యాయం చేసాడు” అని వీహెచ్ అభిప్రాయపడ్డారు.
“షర్మిలా తన పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లయితే, ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేస్తే మంచిది. తెలంగాణలో తన పార్టీని నెలకొల్పడం ద్వారా ఆమె ప్రయోజనం పొందలేరు, ”అని ఆయన వీహెచ్ అన్నారు.
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ , టీఆర్ఎస్, బిజెపి ఇప్పటికే ఉన్నాయి, అదే ఆమె ఆంధ్రలో ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో, జగన్ ను వ్యతిరేకించే వారందరూ ఆమెతో చేతులు కలుపుతారు. అయినా ఆమె తన సోదరుడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తే, ఆపని ఆయనకు వ్యతిరేకంగా ఏపీలో చేయాలని…. అపుడే ఆమె కోరుకున్నది నెరవేరుతందని అన్నారు.
నిజమే అన్నమీద కోపం ఉంటే ఆమె ఏపీలో పోటీ చేయాలి. తండ్రి ప్రభావం ఉన్న రాష్ట్రం అదే. అలా కాకుండా ఆమె తెలంగాణలో పోటీ చేస్తే అది అన్నకు, కేసీఆర్ కి మేలు చేసేదే గాని నష్టం చేయదు. ఆమె కేవలం తెలంగాణలో పార్టీ పెట్టడం అంటే… ఆమెకు జగన్ తో సత్సంబంధాలున్నట్లే అంచనా వేసుకోవాలి.