అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ, ఖర్గే ఆహ్వానించారు. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తమ పార్టీ అందులో భాగమై ఉంటుందని చెప్పారు.
బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ కు వైఎస్సార్ సేవ చేశారని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాడు కూడా పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారని అన్నారు. అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు పోతుందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి కలగన్నారని, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా తాను కూడా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అండమాన్ అయినా..ఆంధ్రా అయినా..ఎక్కడ ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నదానిపై 2 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.
ఇక, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ చేసిన కామెంట్లపై కూడా షర్మిల స్పందించారు. అవి షర్మిలనుద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలని ప్రచారం జరిగింది. దీంతో, ఆ విషయంపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు షర్మిలను అడిగారు. అయితే, కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదని షర్మిల అన్నారు.